Jagan: జగన్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి న్యాయవాది లేఖ
- విశాఖ రాజధాని కాబోతోందన్న జగన్
- రాజధాని అంశం సుప్రీంకోర్టులో ఉందన్న న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ
- జగన్ పై సుమోటోగా చర్యలు తీసుకోవాలని సీజేఐకి లేఖ
విశాఖ ఏపీ రాజధాని కాబోతోందని, తాను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతానని ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లు విశాఖలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. జగన్ వ్యాఖ్యలు విమర్శలపాలు అవుతున్నాయి. రాజధాని అంశం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉండగా, విశాఖను రాజధాని అంటూ జగన్ ఎలా అంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై ఏపీ హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. న్యాయస్థాన ధిక్కార చట్టం 1971లోని సెక్షన్ 2(సీ)ను ఉల్లంఘించినట్టేనని తన లేఖలో పేర్కొన్నారు. తన వ్యాఖ్యల ద్వారా సుప్రీంకోర్టు అధికారాన్ని జగన్ ఉల్లంఘించారనే విషయం అర్థమవుతోందని చెప్పారు. జగన్ పై సుమోటోగా చర్యలు తీసుకోవాలని కోరారు.