Kerala: తల్లిదండ్రులు కాబోతున్న కేరళకు చెందిన ట్రాన్స్ జండర్ జంట
- మూడేళ్లుగా సహజీవనం
- తల్లిదండ్రులు కాబోతున్నామంటూ ఇన్‌స్టాలో వెల్లడి
- ట్రాన్స్ పురుషుడు గర్భం దాల్చడం దేశంలో ఇదే తొలిసారని ప్రకటన
కేరళకు చెందిన ఓ ట్రాన్స్ జండర్ జంట తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ సోషల్ మీడియాలో ఘనంగా ప్రకటించుకుంది. దేశంలో ఓ ట్రాన్స్ జండర్ పురుషుడు గర్భం దాల్చడం ఇదే తొలిసారని వారు పేర్కొన్నారు. జియా, జహాద్‌లు గత మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. వైద్యప్రక్రియల ద్వారా జియా మహిళగా మారారు. ఇక ఆమె సహచరుడు జహాద్ పిల్లలు కనడం కోసం లింగమార్పిడి శస్త్రచికిత్సను వాయిదా వేసుకున్నారు.
తల్లిదండ్రులు అవుదామని వారు నిర్ణయించుకున్నాక వైద్యులను సంప్రదించారు. అప్పటికి.. జహాద్ వక్షోజాలను వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించారు. కానీ.. గర్భసంచీ ఇంకా తొలగించకపోవడంతో జహాద్ గర్భం దాల్చొచ్చని డాక్టర్లు చెప్పారు. దీంతో..జహాద్ లింగమార్పిడి ఆపరేషన్‌ను వాయిదా వేసుకున్నారు. జహాద్ గర్భంతో ఉన్న ఫొటోలను ఆ జంట సోషల్ మీడియాలో పంచుకుంది. మార్చ్‌లో ప్రసవం ఉంటుందని వైద్యులు డేట్స్ ఇచ్చారు. ఇక బిడ్డకు మిల్క్ బ్యాంక్ నుంచి సేకరించిన పాలను పడతామని ఆ జంట పేర్కొంది.
జియా, జహాద్‌లు తమ జీవితాలకు సంబంధించి పలు విషయాలను పంచుకున్నారు. తాను పుట్టుకతో పురుషుడినైనా తల్లి కావాలనే స్త్రీ సహజవాంఛ చిన్నప్పటి నుంచే ఉండేదని జియా పేర్కొన్నారు. ఇక జహాద్ తండ్రి కావాలని కోరుకునే వాడని చెప్పుకొచ్చారు. తొలుత తాము ఓ బిడ్డను దత్తత తీసుకుందామని ప్రయత్నించినా చట్టపరమైన సమస్యలు ఎదురుకావడంతో తానే గర్భం దాల్చేందుకు నిర్ణయించుకున్నానని జహాద్ పేర్కొన్నారు. ఇంతకాలం తమకు మద్దతుగా నిలిచిన స్నేహితులు, శ్రేయోభిలాషులకు వారు సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు.