Bhuma Akhila Priya: గృహ నిర్బంధంలో భూమా అఖిలప్రియ.. తీవ్ర ఉద్రిక్తత
- నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారన్న అఖిలప్రియ
- నంద్యాల గాంధీ చౌక్ లో ఆధారాలను బహిరంగపరుస్తానని వ్యాఖ్య
- దమ్ముంటే అక్కడకు రావాలంటూ రవిచంద్రకు సవాల్
నంద్యాల జిల్లాలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి మధ్య రాజకీయ పోరు కొనసాగుతోంది. ఇరువురి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రవిచంద్రకిశోర్ రెడ్డి అక్రమాలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని అఖిలప్రియ తెలిపారు. నంద్యాల గాంధీ చౌక్ వద్దకు వస్తే ఆధారాలను బహిర్గతం చేస్తానని... దమ్ముంటే అక్కడకు రావాలని ఆమె సవాల్ విసిరారు.
ఈ క్రమంలో ఈ ఉదయం ఆళ్లగడ్డలోని తన నివాసం నుంచి నంద్యాల గాంధీ చౌక్ కు వెళ్లేందుకు ఆమె సిద్ధమయ్యారు. ఆఅయితే, మె నంద్యాలకు వెళ్తే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండొచ్చనే అనుమానాలతో ఆళ్లగడ్డ డీఎస్పీ సుధాకర్ రెడ్డి తన పోలీసు సిబ్బందితో కలిసి అఖిలప్రియ నివాసానికి వెళ్లారు. శాంతిభద్రతల నేపథ్యంలో నంద్యాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నామని నోటీసులు ఇచ్చారు. ఆమెను గృహ నిర్బంధంలో ఉంచారు. అఖిలప్రియ ఇంటి వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు.