DIG Ravi Prakash: లోకేశ్ పాదయాత్రను అడ్డుకోవాలన్న ఉద్దేశం మాకు లేదు: డీఐజీ రవిప్రకాశ్
- చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న లోకేశ్ పాదయాత్ర
- పలు చోట్ల ఉద్రిక్తతలు
- తప్పుడు కథనాలు వస్తున్నాయన్న డీఐజీ
- కోర్టు మార్గదర్శకాల మేరకే వ్యవహరిస్తున్నామని వెల్లడి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. అయితే చిత్తూరు జిల్లాలో పలు చోట్ల లోకేశ్ పాదయాత్రల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. పూతలపట్టులో లోకేశ్ వాహనాలను పోలీసులు సీజ్ చేయగా, బంగారుపాళ్యంలో టీడీపీ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయితే, లోకేశ్ పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ కథనాలు వస్తున్నాయని అనంతపురం రేంజి డీఐజీ రవిప్రకాశ్ వెల్లడించారు.
లోకేశ్ పాదయాత్రను అడ్డుకోవాలన్న ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. పాదయాత్రలో మార్గదర్శకాలు ఉల్లంఘిస్తే మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే తాము పనిచేస్తున్నామని తెలిపారు.
ఎవరినీ, ఎక్కడా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదని, కానీ సోషల్ మీడియాలో నెగెటివ్ వార్తలు ప్రచారం చేస్తున్నారని డీఐజీ రవిప్రకాశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పుకార్లు వ్యాపింపజేయడం తప్పు అని, తప్పుడు ప్రచారం చేసేవాళ్లపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
వీవీఐపీలు, వీఐపీల కార్యక్రమాలకు నిర్దేశించిన ప్రమాణాల మేరకే లోకేశ్ పాదయాత్రకు కూడా బందోబస్తు కల్పిస్తున్నామని, తమకు అన్ని పార్టీలు ఒక్కటేనని డీఐజీ స్పష్టం చేశారు.