PV: స్వర్ణ పతకం కోసం 5 ఏళ్లు ఎదురు చూశా: పీవీ సింధు
- స్వర్ణం కోసం 5 ఏళ్లు ఎదురుచూశా
- ఒలింపిక్ తరువాత అంతటి ఆనందం కలిగింది
- ప్రో వాలీబాల్ లీగ్ ప్రారంభోత్సవానికి హాజరైన సింధు
ప్రపంచ క్రీడాయవనికపై భారతదేశ పేరుప్రతిష్టలు ఇనుమడింప చేసిన షట్లర్ పి.వి.సింధు.. తన విజయాలను గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం కోసం తాను అయిదేళ్లు ఎదురు చూశానని అన్నారు. శనివారం ప్రో వాలీబాల్ లీగ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆమె మీడియాతో ముచ్చటించారు.
‘‘ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో స్వర్ణ పతకం సాధించడం చాలా పెద్ద ఘనత. ఒలింపిక్ పతకం తరువాత అంతటి ఆనందం ఈ టోర్నీ విజయంతో వచ్చింది. అప్పటికి నేను స్వర్ణ పతకం కోసం అయిదేళ్లుగా ఎదురు చూస్తున్నా. అంతకుముందు రెండు రజతాలు రెండు కాంస్యాలు గెలిచా. 2019లో ప్రపంచ ఛాంపియన్ అయ్యా’’ అంటూ సింధు అప్పటి ఘటనలను గుర్తు చేసుకున్నారు.
2013, 14 ప్రపంచ ఛాపింయన్ షిప్‌లలో కాంస్య పతకాలు సాధించిన సింధు 2017,18 టోర్నమెంట్లలో రజతం దక్కించుకున్నారు. 2019 టోర్నమెంట్ ఫైనల్‌లో జపాన్ క్రీడాకారిణి నవోమీ ఒకుహారాపై నెగ్గి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచారు.