USA: అమెరికా, చైనా మధ్య చిచ్చురేపిన ‘బెలూన్’.. అసలేం జరిగిందంటే..

Ordered to shoot it down ASAP Joe Biden on Chinese spy balloon

  • తమ భూభాగంలోకి వచ్చిన బెలూన్ ను పేల్చివేసిన అగ్రరాజ్యం
  • అది చైనా పంపిన నిఘా బెలూన్ గా భావిస్తున్న అమెరికా
  • వాతావరణాన్ని అధ్యయనం చేసే బెలూన్ అంటున్న చైనా
  • దాన్ని కూల్చినందుకు తగిన సమాధానం చెబుతామని హెచ్చరిక

అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ దేశం చైనా మధ్య ఓ బెలూన్ చిచ్చు రేపుతోంది. తమ భూభాగంలోకి వచ్చిన చైనా నిఘా బెలూన్‍ను అమెరికా కూల్చివేసింది. తమ సైనిక స్థావరాలపై నిఘా పెట్టేందుకు డ్రాగన్ దేశం పంపినదిగా అనుమానించిన ఆ బెలూన్‍ను కరోలినా తీరంలో పడే విధంగా అమెరికా దళాలు పేల్చివేశాయి. ఈ విషయాన్ని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ వెల్లడించింది. బెలూన్‍ విషయం తెలిసిన వెంటనే తక్షణమే దాన్ని కూల్చేయాలని ఆదేశించినట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు. అమెరికా ఎయిర్ ఫోర్స్ గంటల వ్యవధిలోనే దాన్ని కూల్చివేసింది. ‘నేడు ఉద్దేశపూర్వకంగా, చట్టబద్ధంగా చర్యలు చేపట్టాం. అధ్యక్షుడు జో బైడెన్, ఆయన నేతృత్వంలోని జాతీయ రక్షణ బృందం ఎల్లప్పుడూ అమెరికా ప్రజల భద్రతకే తొలి ప్రాధాన్యతనిస్తుందని నిరూపించాం. చైనా నిబంధనల ఉల్లంఘనను ప్రభావంతంగా తిప్పికొట్టాం’ అని అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. 

సముద్ర జలాల్లో పడిపోయిన బెలూన్ శిథిలాలను వీలైనంత మేర సేకరించేందుకు ఓ ఓడను కూడా అమెరికా పంపింది. ‘బుధవారం, నాకు బెలూన్ గురించి వివరించినప్పుడు, వీలైనంత త్వరగా దాన్ని కాల్చివేయమని ఆదేశించాను. పేల్చివేత వల్ల భూమిపై ఎవరికీ నష్టం జరగకుండా చేయాలని నిర్ణయించుకున్నారు. సముద్రం మీదకు వెళ్లినప్పుడు పేల్చివేయాలని నిర్ణయించారు. దాన్ని విజయవంతంగా తొలగించారు. ఆ ఆపరేషన్ చేసిన మా ఏవియేటర్లను అభినందిస్తున్నా’ అని బైడెన్ పేర్కొన్నారు. 
 
ఉత్తర అమెరికాలోని ప్రధానమైన సైనిక స్థావరాల సమాచారాన్ని తెలుసుకునేందుకు ఈ స్పై బెలూన్‍ను చైనా పంపిందని అమెరికా అనుమానించింది. దీంతో అమెరికా, చైనా మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. కాగా, వాతావరణంపై అధ్యయనం చేసేందుకే బెలూన్ ను పంపించామని చైనా అంటోంది. దాన్ని అమెరికా కూల్చివేయడం పట్ల చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ నుంచి కూడా సరైన ప్రతిస్పందన ఉంటుందని పేర్కొంది. అది సివిలియన్ ఎయిర్ షిప్ అని ప్రకటించింది. అనుకోకుండా అది దారి మార్చుకొని అమెరికా వైపునకు వెళ్లిందని చైనా విదేశీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

  • Loading...

More Telugu News