constable: ఏపీ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల
- ఫలితాలను వెబ్ సైట్ లో పెట్టిన రిక్రూట్ మెంట్ బోర్డు
- ఫిజికల్ టెస్టులకు 95,208 మంది అర్హత
- ఈవెంట్స్ కు ఈ నెల 13 నుంచి 20వ తేదీ దాకా దరఖాస్తుల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ లో కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన ప్రాథమిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఈరోజు ఏపీఎస్ఎల్ పీఆర్ బీ వెబ్ సైట్ లో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షకు 4,59,182 అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 95,208 మంది ఫిజికల్ టెస్టులకు అర్హత సాధించారు. ఈ రోజు నుంచి 7వ తేదీ వరకు ఆన్ లైన్ లో ఓఎంఆర్ షీట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు బోర్డు తెలిపింది.
జనవరి 22న రాష్ట్రంలోని 997 పరీక్షా కేంద్రాల్లో కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. కేవలం 15 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు. క్వాలిఫై అయిన వారికి ఈవెంట్స్ నిర్వహించనున్నారు. అందులోనూ అర్హత సాధిస్తే మెయిన్స్ నిర్వహించి తుది ఎంపిక చేపట్టనున్నారు.
ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారు రెండో దశకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రెండో దశ అప్లికేషన్లను ఫిబ్రవరి 13వ తేదీ సాయంత్రం 3 గంటలకు ప్రారంభించనున్నట్లు రిక్రూట్ మెంట్ బోర్డ్ తెలిపింది. అభ్యర్థులు ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించింది.
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి