Teacher: సీపీఎస్ రద్దుకు సమరశంఖం పూరించిన ఉపాధ్యాయులు

Teachers held protest to remove CPS

  • సీపీఎస్ రద్దుకు ఎప్పట్నించో డిమాండ్
  • ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలేదన్న యూటీఎఫ్
  • నేడు విజయవాడలో దీక్ష
  • ఈ నెల 24న ఛలో ఢిల్లీ

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు కోసం ఉపాధ్యాయులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, విజయవాడలోని యునైటెడ్ టీచర్స్ ఫ్రంట్ (యూటీఎఫ్) కేంద్ర కార్యాలయం ఆవరణలో ఉపాధ్యాయులు దీక్షకు దిగారు. ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాల్సిందేనని ఉపాధ్యాయులు స్పష్టం చేస్తున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోందని యూటీఎఫ్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్నారని, నాలుగేళ్లయినా గానీ పాత పెన్షన్ పునరుద్ధరిస్తామన్న హామీని సీఎం నెరవేర్చలేదని ఆరోపించారు. సీపీఎస్ కు బదులు జీపీఎస్ తీసుకువస్తామంటున్నారని యూటీఎఫ్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ఈ నెల 3న గన్నవరంలో సంకల్పదీక్ష తలపెడితే అనుమతి ఇవ్వలేదని అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సీపీఎస్ రద్దు చేస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఐక్య ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు. వారంలో రాష్ట్ర కార్యవర్గం సమావేశమై సీపీఎస్ రద్దుపై కార్యాచరణకు నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. 

సీపీఎస్ రద్దు కోరుతూ ఈ నెల 24న ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొత్తం 24 సంఘాలు పాలుపంచుకుంటాయని వివరించారు. ఛలో ఢిల్లీకి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులు తరలివస్తారని యూటీఎఫ్ నేతలు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News