Telangana: తెలంగాణ అసెంబ్లీ బుధవారానికి వాయిదా
- రేపు అసెంబ్లీకి సెలవు
- 8న బడ్జెట్ పై సాధారణ చర్చ
- 12న ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ బుధవారానికి వాయిదా పడింది. వచ్చే 2023-24 ఆర్ధిక సంవత్సరానికి గాను రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి తన్నీరు హరీశ్ రావు ఈ ఉదయం శాసనసభలో ప్రవేశపెట్టారు. 2,90,396 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదిస్తూ హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తి చేసిన వెంటనే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభను వాయిదా వేశారు. బడ్జెట్ పై అధ్యయనం చేసేందుకు మంగళవారం అసెంబ్లీకి సెలవు ఇవ్వగా.. సమావేశాలు తిరిగి బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతాయి.
బుధవారం బడ్జెట్ పై సాధారణ చర్చ జరగనుంది. 9,10,11వ తేదీల్లో శాఖల వారీగా పద్దులపై శాసనసభలో చర్చ జరగనుంది. ఈ నెల 12న ఉభయ సభల్లో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించిన తర్వాత నిరవధికంగా వాయిదా పడే అవకాశం ఉంది. కాగా, శాసన మండలిలో రాష్ట్ర బడ్జెట్ ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రవేశపెట్టారు.