Balakrishna: నర్సులను అవమానించానంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు: బాలకృష్ణ
- సోషల్ మీడియాలో బాలయ్య వివరణ
- తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని ఆగ్రహం
- నర్సు సోదరీమణులంటే తనకెంతో గౌరవం అని వెల్లడి
- తన వ్యాఖ్యల పట్ల ఎవరైనా బాధపడితే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని స్పష్టీకరణ
ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారంటూ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. నర్సులను కించపరిచానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కావాలనే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, దీన్ని తాను ఖండిస్తున్నానని తెలిపారు. రోగులకు సేవలు అందించే నర్సు సోదరీమణులంటే తనకెంతో గౌరవం అని బాలకృష్ణ స్పష్టం చేశారు.
"బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను. రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కరోనా వ్యాప్తి సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది నర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పగలనక, రాత్రనక నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు ఎంతగానో సేవలు అందించారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకుని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలను దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను" అంటూ వివరణ ఇచ్చారు.