Delhi: ఢిల్లీ మేయర్ ఎన్నిక మళ్లీ వాయిదా
- మున్సిపల్ హౌజ్ లో ఆప్, బీజేపీ సభ్యుల వాగ్వివాదం
- సభను వాయిదా వేస్తున్నట్టు ప్రిసైడింగ్ అధికారి ప్రకటన
- గత నెల రెండుసార్లు ఇలానే వాయిదా పడ్డ సభ
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) మేయర్ ఎన్నిక విషయంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కి మరోసారి చుక్కెదురైంది. కొత్త మేయర్‌ను ఎన్నుకునే కసరత్తు వరుసగా మూడోసారి విఫలమైంది. ఆప్, బీజేపీ సభ్యులు సోమవారం ఢిల్లీ మున్సిపల్ హౌజ్ లో గందరగోళం సృష్టించారు. దాంతో, సభ వాయిదా పడింది. డిసెంబరు 4న మున్సిపల్ ఎన్నికల తర్వాత మూడోసారి సమావేశమైన సభలో నగరంలోని ప్రముఖులకు ఓటు హక్కు కల్పించే విషయంలో ఆప్ సభ్యులు నిరసనకు దిగడంతో సభా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా నామినేట్ చేసిన సభ్యులను కూడా మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతిస్తామని ప్రిసైడింగ్ అధికారి సత్య శర్మ ప్రకటించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ ప్రకటన తర్వాత ఆప్ కౌన్సిలర్లు పెద్దపెట్టున నినాదాలు చేశారు. దాంతో, గందరగోళం మధ్య సభ, మేయర్ ఎన్నికలను మళ్లీ వాయిదా వేశారు. కాగా, ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్య శర్మ ఎన్నికలను రిగ్గింగ్ చేశారని ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా తమ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుందని అన్నారు. కాగా, జనవరి 6, 24వ తేదీల్లో జరిగిన మున్సిపల్ సమావేశాల తొలి సెషన్లలోనూ బీజేపీ, ఆప్ సభ్యుల మధ్య వాగ్వివాదం కారణంగా మేయర్‌ను ఎన్నుకోకుండా ప్రిసైడింగ్ అధికారి సభను వాయిదా వేశారు. కాగా, ఎంసీడీ ఎన్నికల్లో ఆప్ కు ఎక్కువ సీట్లు వచ్చాయి. 15 ఏళ్ల తర్వాత బీజేపీ ఈ ఎన్నికల్లో ఓడిపోయింది. 105 వార్డులను గెలుచుకున్న బీజేపీ ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆప్ ఆరోపించింది.