harman preet kour: ధోనీ, గంగూలీ వల్లే నేను ఈ రోజు ఇలా..: హర్మన్ ప్రీత్ కౌర్
- వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పిన కౌర్
- తన జీవితంలో పెద్ద పాత్ర పోషించారని వ్యాఖ్య
- కెప్టెన్ గా వారి బాటలో నడుస్తున్నానని వెల్లడి
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఎంతో మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తినీయుడు, ఆరాధ్యుడని అనడంలో ఎలాంటి అతిశయం లేదు. హార్థిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ సహా ఎంతో మంది ధోనీ గురించి చెప్పిన వారే. తాజాగా భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ఇప్పుడు ఎంఎస్ ధోనీతోపాటు, మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానంటూ వ్యాఖ్యానించింది.
‘‘ఎంఎస్ ధోనీ మైదానంలో ఎంత తెలివిగా వ్యవహరిస్తాడో మనకు తెలుసు. ధోనీ వెనుకటి మ్యాచ్ ల వీడియోలను ఇప్పుడు చూసినా, అతడి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. నేను సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ నుంచి ఎంతో నేర్చుకున్నాను. మైదానంలో నాకు, జట్టుకు సాయపడే చిన్న అంశాలను కూడా నేను పరిగణనలోకి తీసుకుంటాను. కెప్టెన్సీ గురించి మాట్లాడేటప్పుడు వారిద్దరూ (ధోనీ, గంగూలీ) నా జీవితంలో పెద్ద పాత్ర పోషించారు.
వారు జట్టును నడిపించిన తీరును నేను అనుసరిస్తున్నాను. సౌరవ్ గంగూలీ టీమిండియాకు కెప్టెన్ గా పనిచేసిన సమయంలో భారత క్రికెట్ అభివృద్ధి దశలో నడిచింది. సౌరవ్ డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరణం మార్చే తీరు, ఆటగాళ్ల ప్రతిభను నమ్మి, వారి పట్ల విశ్వాసం ఉంచడం నిజంగా ఆచరణీయం’’ అని కౌర్ పేర్కొంది.