Contactless credit card: కాంటాక్ట్ లెస్ కార్డు వాడుతున్నారా.. ఈ జాగ్రత్తలు అవసరం!
- పీవోఎస్ మెషిన్ల వద్ద ట్యాప్ అండ్ పే విధానం
- స్వైప్ చేయకుండా రేడియో తరంగాల సాయంతో లావాదేవీలు
- కార్డ్ సమాచారం ఇతరుల చేతికి వెళ్లకుండా చూసుకోవాలి
క్రెడిట్, డెబిట్ కార్డులన్నీ కాంటాక్ట్ లెస్ ఆప్షన్ తో వస్తున్నాయి. దీంతో కార్డును స్వైప్ చేయాల్సిన అవసరం లేకుండా పీవోఎస్ మెషిన్ కు సమీపంలో ఉంచితే చాలు. చెల్లింపు వైఫై విధానంలో జరిగిపోతుంది. దీనివల్ల పిన్ ను గుర్తు పెట్టుకోవాల్సిన ఇబ్బంది తప్పుతుంది. కార్డ్ ను స్వైప్ చేయడం వల్ల కొంత కాలానికి డ్యామేజ్ అయిపోతుందన్న భయం కూడా లేదు.
కార్డులకు సంబంధించి ‘ట్యాప్ అండ్ పే’ టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్నారు. అయితే, వీటికి సంబంధించి కొంత రిస్క్ కూడా ఉంటుంది. క్రెడిట్, డెబిట్ కార్డు సమాచారం దుర్వినియోగం అయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
కాంటాక్ట్ లెస్ చెల్లింపు జరిగేందుకు వీలుగా కార్డు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ తరంగాలను పంపుతుంటుంది. కార్డ్ ను పీవోఎస్ రీడ్ మెషిన్ కు నాలుగు అంగుళాల దూరంలోపు ఉంచినప్పుడు ఈ తరంగాల ఆధారంగానే చెల్లింపులు జరిగిపోతాయి. అందుకే అనధికారిక చెల్లింపులు జరగకుండా కార్డ్ ని జాగ్రత్త పరచుకోవాలి. ఇందుకోసం ఆర్ఎఫ్ఐడీ బ్లాకింగ్ వ్యాలెట్ ను ఉపయోగించొచ్చు. కాంటాక్ట్ లెస్ కార్డు సమాచారాన్ని రీడ్ మెషిన్లతో నేరస్థులు కొట్టివేయకుండా ఆర్ఎఫ్ఐడీ బ్లాకింగ్ వ్యాలెట్ అడ్డుకుంటుంది. వ్యాలెట్ దాటి తరంగాలు బయటకు రావు. దీంతో మీ కార్డ్ సమాచారాన్ని మరొకరు స్కాన్ చేసుకోలేరు.
కాంటాక్ట్ లెస్ కార్డ్ కనుక దీన్ని ఎంతో జాగ్రత్త పెట్టుకోవాలి. ఈ కార్డ్ తో రూ.5,000 వరకు పిన్ అవసరం లేకుండా ట్యాప్ చేసి తీసుకోవచ్చు. కనుక ఈ కార్డును ఎక్కడో పారేసుకుంటే రూ.5,000 చొప్పున నేరస్థులు మొత్తం ఖాళీ చేయొచ్చు. అందుకని లాక్ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవాలి. ఒకవేళ అనధికారిక లావాదేవీని గుర్తిస్తే వెంటనే కార్డును బ్లాక్ చేసుకోవాలి. దాంతో కొద్ది నష్టంతోనే బయటపడొచ్చు.