Gautam Adani: కోలుకుంటున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు.. 20 శాతం మేర వృద్ధి
- ముందస్తుగా రుణాలు చెల్లిస్తామన్న అదానీ ప్రకటనతో షేర్లకు ఊపు
- అదానీ ఎంటర్‌ప్రైజ్ షేర్ల విలువలో గొప్ప పెరుగుదల
- మంగళవారం ట్రేడింగ్‌లో దూకుడుగా అదానీ గ్రూప్ షేర్లు
హిండెన్ బర్గ్ నివేదిక ఫలితంగా భారీగా డీలాపడ్డ అదానీ గ్రూప్ షేర్లు క్రమంగా కోలుకుంటున్నాయి. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో అదానీ సంస్థల షేర్లు వృద్ధి నమోదు చేశాయి. అదానీ సంస్థలు అకౌంటింగ్ అవకతవకలకు పాల్పడ్డాయని, అప్పుల కుప్పగా మారాయని జనవరి 24న అమెరికా ఆర్థికరంగ రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ సంచలన నివేదిక వెలువరించిన విషయం తెలిసిందే. దీంతో.. అదానీ షేర్లు ఒక్కసారిగా నష్టాల బాట పట్టాయి. వాటి మార్కెట్ విలువ ఏకంగా 120 బిలియన్ డాలర్ల మేర పతనం కావడంతో గ్రూప్ యజమాని గౌతమ్ అదానీకి భారీ షాక్ తగిలింది. అపరకుబేరుడిగా వెలుగొందుతున్న ఆయన ప్రపంచ సంపనున్నల జాబితాలో నాలుగు స్థానాల మేర దిగజారారు.
అదానీ గ్రూప్ మార్కెట్ సంపద భారీగా కనుమరుగవడంతో సంస్థ రుణ సేకరణ సామర్థ్యంపై మదుపర్లలో సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే.. 1.1 బిలియన్ డాలర్ల మేర రుణాలను ముందస్తుగా చెల్లిస్తామంటూ గౌతమ్ అదానీ సోమవారం ప్రకటించడంతో గ్రూప్ షేర్లు ఎగబాకడం ప్రారంభించాయి. ఈ క్రమంలో మంగళవారం షేర్ల ట్రేడింగ్ మూడు మార్లు తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. ముఖ్యంగా అదానీ గ్రూప్‌లో ప్రధానమైన అదానీ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ షేర్లు 20 శాతం మేర పుంజుకున్నాయి. ఇతర గ్రూప్ సంస్థల షేర్ల విలువలోనూ ఓ మోస్తరు పెరుగుదల నమోదైంది.