Harirama Jogaiah: హరిరామజోగయ్య పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ
- ఏపీలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కోరుతూ పిటిషన్
- జగన్ అడ్డుపడుతున్నారన్న పిటిషనర్ తరఫు న్యాయవాది
- ప్రభుత్వ జీవోలు చెల్లవని కోర్టుకు తెలిపిన వైనం
- రాజ్యాంగ సవరణ కూడా ఉందని వెల్లడి
- కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం
కాపు రిజర్వేషన్ల అంశంపై కాపు ఉద్యమ నేత హరిరామజోగయ్య దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఏపీలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ హరిరామజోగయ్య తన పిటిషన్ లో పేర్కొన్నారు. కాపులకు ఈడబ్ల్యూఎస్ కోటా కింద రిజర్వేషన్లు కల్పించకుండా సీఎం జగన్ అడ్డుపడుతున్నారని పిటిషనర్ తరఫున న్యాయవాది రాధాకృష్ణ కోర్టుకు తెలిపారు.
బలిజలకు రిజర్వేషన్లు వస్తే ఆర్థికంగా బలపడతారని సీఎం భావిస్తున్నారని ఆరోపించారు. అందుకే సీఎం జగన్ జీవో 60, జీవో 66లను తీసుకువచ్చారని, కానీ అవి చెల్లుబాటు కాదని వాదనలు వినిపించారు.
ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ... ఈ అంశంపై ఇప్పటికే అనేక పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని కోర్టుకు తెలియజేశారు. తాజా పిటిషన్ ను హైకోర్టు డివిజన్ బెంచ్ కు పంపాలని కోరారు.
అందుకు, హరిరామజోగయ్య తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. 103 రాజ్యాంగ సవరణ కింద ఈ రిజర్వేషన్లను చట్టపరంగా తీసుకువచ్చారని వివరించారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలతో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.