Turkey: టర్కీ భూకంప విలయం.. మృత్యుంజయులు ఈ చిన్నారులు!

Children rescued from under debris of collapsed buildings in Turkey

  • టర్కీ, సిరియా భూకంప ప్రళయంలో ప్రాణాలు కోల్పోయిన వేలాదిమంది
  • కొనసాగుతున్న రెస్క్యూ కార్యక్రమాలు
  • శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరు బాలురను క్షేమంగా బయటకు తీసిన రెస్క్యూ సిబ్బంది

టర్కీ, సిరియాలలో మొన్న సంభవించిన భారీ భూకంపం వేలాదిమంది ప్రాణాలు తీసింది. మరెంతోమంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పట్టణాలన్నీ సమాధుల్లా మారిపోయాయి. కుప్పకూలిన భవనాల కింద చిక్కుకుపోయిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఓ అద్భుతం జరిగింది. శిథిలమైన భవనాల కింద కొన్ని గంటలపాటు చిక్కుకుపోయిన ఇద్దరు చిన్నారులు మృత్యుంజయులుగా బయటికొచ్చారు. వాయవ్య సిరియాలోని జిందెరిస్ పట్టణంలో జరిగిందీ ఘటన.

భూకంపం నుంచి సురక్షితంగా బయటపడిన ఓ కుటుంబం తమ కుమారుడి జాడ కనిపించకపోవడంతో ఆందోళన చెందింది. బాలుడు నూర్ కోసం అతడి తండ్రి శిథిలాల కింద గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అతడు సహాయక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు అణువణువు గాలించారు. ఈ క్రమంలో శిథిలాల కింద ఓ చోట చిక్కుకుపోయిన నూర్‌ కనిపించాడు. వెంటనే అతడికి ధైర్యం చెప్పి సురక్షితంగా బయటకు తీశారు. 

దీంతో చిన్నారి కుటుంబం ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను రెస్క్యూ టీం విడుదల చేసింది. కాగా, అదే పట్టణంలో ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. శిథిలాల కింద చిక్కుకున్న హరుణ్ అనే బాలుడిని సహాయక సిబ్బంది కాపాడారు. చలి, చీకటి మధ్య రాత్రుళ్లు బిక్కుబిక్కుమంటూ గడిపిన హరుణ్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. టర్కీ, సిరియాలలో సహాయక కార్యక్రమాలు అవిశ్రాంతంగా కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News