Team India: ఆసుపత్రి గది నుంచి తొలిసారి బయటకొచ్చిన రిషబ్ పంత్
- తన ఆరోగ్యం గురించి కీలక అప్డేట్ ఇచ్చిన క్రికెటర్
- డిసెంబర్ 30న కారు ప్రమాదంలో పంత్ కు తీవ్ర గాయాలు
- అతని మోకాళ్లకు రెండు శస్త్ర చికిత్సలు చేసిన వైద్యులు
భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ కోలుకుంటున్నాడు. డిసెంబర్ 30న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పంత్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. తొలుత డెహ్రాడూన్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందిన అతను తర్వాత ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ అతనికి రెండు శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. దాదాపు 40 రోజులుగా ఆసుపత్రిలో ఉన్న పంత్ తన ఆరోగ్యం గురించి తాజా సమాచారం ఇచ్చాడు. బల్కనీలో కూర్చున్న ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఇన్నాళ్లకు బయటకు వచ్చి స్వచ్చమైన గాలి పీల్చుకున్నానని తెలిపాడు.
‘ఇలా బయట కూర్చొని స్వచ్ఛమైన గాలి పీలుస్తుంటే ఇంత హాయిగా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు’ అని పంత్ క్యాప్షన్ ఇచ్చాడు. ఆసుపత్రి భవంతిలోనే పంత్ బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా, మోకాళ్లకు శస్త్రచికిత్స కావడంతో అతను తిరిగి మైదానంలోకి రావడానికి కనీసం ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అతను ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. కోలుకొని, ఫిట్ నెస్ సాధిస్తే ఈ ఏడాది చివర్లో జరిగే టీ20 ప్రపంచ కప్లో ఆడే అవకాశం ఉంది.