MS Dhoni: ట్రాక్టర్ తో పొలం దున్నుతున్న ధోని.. వీడియో ఇదిగో!
- రెండేళ్ల తర్వాత ఇన్ స్టాలో వీడియో పెట్టిన టీం ఇండియా మాజీ కెప్టెన్
- కొత్త విషయం నేర్చుకోవడం చాలా మంచిదంటూ కామెంట్
- రాంచీలోని తన ఫాంహౌస్ లో వ్యవసాయ పనులు చేస్తున్న ధోనీ
క్రికెట్ కు రెండేళ్ల క్రితం రిటైర్మెంట్ ప్రకటించాక టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇతర బిజినెస్ లపై దృష్టి సారించారు. రాంచీలోని తన ఫాంహౌస్ లో ధోని స్ట్రాబెర్రీ సహా పలు పంటలు పండిస్తున్నారు. తరచుగా తను కూడా పొలం పనులు చేస్తుంటారు. తాజాగా ట్రాక్టర్ తో పొలం చదును చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ధోనీ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.
రెండేళ్ల తర్వాత ధోనీ పోస్ట్ కనిపించడంతో క్షణాలలోనే అది వైరల్ గా మారింది.( వీడియో లింక్ ) కోటి మందికి పైగా ఆ వీడియోను చూడగా.. 28 లక్షల మంది లైక్ చేశారు, 60 వేల మంది నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ఈ వీడియోలో ధోనీ పొలం దున్నుతూ, చదును చేస్తూ కనిపించారు. ఆయనతో పాటు మరో వ్యక్తి కూడా ట్రాక్టర్ పై ఉన్నారు.
ఎప్పుడైనా సరే.. ఓ కొత్త విషయం తెలుసుకోవడం, నేర్చుకోవడం సంతోషాన్ని కలిగిస్తుందంటూ ధోనీ తన వీడియోకు క్యాప్షన్ జతచేశారు. అయితే, పొలం చదును చేయడానికి చాలా ఎక్కువ సమయం పట్టిందని ఆయన వివరించారు. మొత్తానికి పొలమంతా ట్రాక్టర్ తో ధోనియే చదును చేసినట్లు ఉన్నారని ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్ కే) ఈ వీడియోపై స్పందించింది. చాలా రోజుల తర్వాత ధోని దర్శనం లభించిందని కామెంట్ చేసింది. రెండేళ్లుగా ధోనీ ఇన్ స్టాలో ఎలాంటి పోస్ట్ పెట్టకపోవడంపై మరో యూజర్ కాస్త కొంటెగా స్పందించాడు. ‘మొత్తానికి రెండేళ్ల తర్వాత ధోనికి తన ఇన్ స్టా పాస్ వర్డ్ గుర్తొచ్చింది. లవ్ యూ మాహి భాయ్’ అంటూ కామెంట్ చేశాడు.