Ravindra Jadeja: పునరాగమనంలో జడేజా అదుర్స్... ఆసీస్ 177 ఆలౌట్

Jadeja rattled the timer in comeback as Aussies all out for 177 runs in first innings

  • గాయం కారణంగా చాన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న జడేజా
  • ఆసీస్ తో తొలి టెస్టుతో మళ్లీ జట్టులోకి వచ్చిన వైనం
  • 5 వికెట్లతో సత్తా చాటిన లెఫ్టార్మ్ స్పిన్నర్
  • అశ్విన్ కు 3 వికెట్లు
  • భారత్ స్పిన్ దెబ్బకు ఆసీస్ విలవిల 

గతేడాది గాయానికి గురై కొన్ని నెలల పాటు క్రికెట్ కు దూరమైన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పునరాగమనంలోనే సత్తా చాటాడు. నాగపూర్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో జడేజా తన లెఫ్టార్మ్ స్పిన్ తో ఆసీస్ వెన్ను విరిచాడు. జడేజా 5 వికెట్లు పడగొట్టడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 177 పరుగులకే ఆలౌట్ అయింది. మరో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తీసి ఆసీస్ పతనంలో తనవంతు పాత్ర పోషించాడు. 

నాగపూర్ పిచ్ స్పిన్ కు సహకరిస్తుందో, పేసర్లకు అనుకూలిస్తుందోనన్న సందిగ్ధత నడుమ... ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆ జట్టు 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి దిగ్భ్రాంతికి గురైంది. తొలి వికెట్ ను సిరాజ్ తీయగా, రెండో వికెట్ ను షమీ పడగొట్టాడు. ఎంతో అనుభవం ఉన్న ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా (1), డేవిడ్ వార్నర్ (1) సింగిల్ డిజిట్ స్కోరుకు పెవిలియన్ బాటపట్టారు. దాంతో, ఇది పేస్ పిచ్ అన్న వ్యాఖ్యలు వినిపించాయి. 

అయితే, మార్నస్ లబుషేన్ (49), స్టీవ్ స్మిత్ (37) జోడీ నిలకడగా ఆడుతూ పిచ్ పై పేస్ ఏమంతగా లేదన్న అభిప్రాయం కల్పించారు. అయితే, స్పిన్నర్ల రంగప్రవేశంతో పరిస్థితి మారిపోయింది. జడేజా, అశ్విన్ పోటాపోటీగా వికెట్లు తీసి భారత్ కు తొలి రోజు ఆటలో పైచేయి సాధించిపెట్టారు. 

ముఖ్యంగా, పిచ్ నుంచి సహకారం అందుకున్న జడేజా ఆసీస్ మిడిలార్డర్ ను అతలాకుతలం చేశాడు. ఫామ్ లో ఉన్న లబుషేన్, స్మిత్ ల వికెట్ల తోపాటు మాట్ రెన్ షా (0), పీటర్ హాండ్స్ కోంబ్ (31), టాడ్ మర్ఫీ (0)లను అవుట్ చేసి కంగారూలను కోలుకోలేని దెబ్బకొట్టాడు. 

మరో ఎండ్ లో అశ్విన్ ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (36) పోరాటానికి అద్భుతమైన బంతితో తెరదించాడు. అశ్విన్ విసిరిన బంతిని ఆడబోయి కేరీ బౌల్డయ్యాడు. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ (6) వికెట్ కూడా అశ్విన్ ఖాతాలోకే చేరింది. ఆసీస్ టెయిలెండర్ స్కాట్ బోలాండ్ ను బౌల్డ్ చేయడం ద్వారా ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్ కు అశ్విన్ తెరదించాడు.

  • Loading...

More Telugu News