Nara Lokesh: నారా లోకేశ్ ను కలిసిన ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు
- మూడేళ్లకోసారి రెన్యువల్ చేసుకోమంటున్నారని ఆవేదన
- టీడీపీ హయాంలో పదేళ్లకోసారి రెన్యువల్ ఉండేదని వెల్లడి
- ఫైర్ అనుమతుల పేరుతో వేధిస్తున్నారని ఆవేదన
- జగన్ సర్కారు విద్యావ్యవస్థను నాశనం చేసిందన్న లోకేశ్
- టీడీపీ అధికారంలోకి రాగానే పాత విధానం అమలు చేస్తామని హామీ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేశ్ ను ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు కలిశాయి.
టీడీపీ హయాంలో ప్రైవేటు స్కూళ్ల అనుమతుల పునరుద్ధరణ (రెన్యువల్) పదేళ్లకోసారి జరిగేదని, కానీ వైసీపీ ప్రభుత్వం మూడేళ్లకోసారి రెన్యువల్ చేసుకోవాలని నిబంధన తీసుకువచ్చిందని ప్రైవేటు స్కూళ్ల ప్రతినిధులు వాపోయారు. దానికితోడు ఫైర్ డిపార్ట్ మెంట్ అనుమతుల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని లోకేశ్ కు తెలిపారు. తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా లోకేశ్ స్పందిస్తూ, జగన్ ప్రభుత్వం విద్యావ్యవస్థను నాశనం చేసిందని విమర్శించారు. జే-ట్యాక్స్ కోసం ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలను వేధిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే పాత పద్ధతిలోనే పదేళ్లకోసారి రెన్యువల్ విధానాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఫైర్ ఎన్ఓసీ, ఇతర కారణాలను సాకులుగా చూపుతూ జరుగుతున్న వేధింపులు లేకుండా చేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు.
అంతేకాకుండా, విద్యుత్ బిల్లుల అంశాన్ని పరిశీలించి, మంచి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.