Andhra Pradesh: జగన్ తో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ భేటీ.. కలిసి పనిచేద్దామని హామీ ఇచ్చిన అధినేత!
- వసంత కృష్ణ ప్రసాద్-మంత్రి జోగి రమేశ్ మధ్య విభేదాలు
- ఎమ్మెల్యేను పిలిపించుకుని అరగంటపాటు మాట్లాడిన సీఎం జగన్
- నియోజకవర్గంపై దృష్టి సారించాలని సూచన
- మనిద్దరం కలిసి మరో 30 ఏళ్లు కలిసి సాగుదామని హామీ
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేశ్ మధ్య నెలకొన్న విభేదాల పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుం బిగించారు. నిన్న ఎమ్మెల్యేను పిలిపించుకున్న జగన్ దాదాపు అరగంటపాటు మాట్లాడారు. విభేదాలను పక్కనపెట్టాలని, ఇద్దరం కలిసి మరో 25-30 ఏళ్లు కలిసి పనిచేద్దామని ఎమ్మెల్యేతో సీఎం చెప్పినట్టు తెలిసింది.
సీఎంతో భేటీ సందర్భంగా వసంత కృష్ణ ప్రసాద్ తన అసంతృప్తిని వెళ్లగక్కారు. తాను ఎప్పుడూ, ఎవరినీ ఏమీ అననని, కానీ ఈ అనుభవాలతో రాజకీయాలపై ఆసక్తి చచ్చిపోయిందని సీఎం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన సీఎం.. అలాంటిదేమీ లేదని, నియోజకవర్గంపై దృష్టి సారించాలని, గడపగడపకు కార్యక్రమాన్ని మొదలుపెట్టి ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.
ఏమైనా ఇబ్బంది ఉంటే తన కార్యదర్శి ధనుంజయరెడ్డి దృష్టికి తీసుకెళ్తే ఆయన సమన్వయం చేస్తారని అన్నారు. ఒకరి నియోజకవర్గంలో మరొకరు వేలు పెట్టకుండా చూద్దామని చెప్పిన సీఎం.. రాజకీయాల్లో తనతో వచ్చే 25-30 ఏళ్లు ఉంటారని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు, వసంతకృష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేశ్‌ను పిలిపించుకుని మాట్లాడాలని ధనుంజయరెడ్డిని జగన్ ఆదేశించారు.