Mukesh Ambani: ఉత్తరప్రదేశ్ లో రూ. 75 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం: ముఖేశ్ అంబానీ
- అభివృద్ధి బాటలో దేశం పయనిస్తోందన్న అంబానీ
- దేశ ఆర్థిక పునాదులు బలంగా ఉన్నాయని వ్యాఖ్య
- కేంద్ర బడ్జెట్ పై ప్రశంసలు
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పై రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ప్రశంసలు కురిపించారు. భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కేంద్ర బడ్జెట్ పునాదులు వేసిందని చెప్పారు. బలమైన అభివృద్ధి బాటలో మన దేశం పయనిస్తోందని తాను విశ్వసిస్తున్నానని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల కంటే మన దేశ ప్రజలు సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకుంటున్నారని చెప్పారు. మన దేశ ఆర్థిక పునాదులు చాలా బలంగా ఉన్నాయని అన్నారు.
జీవ ఇంధన రంగంలోకి ప్రవేశించబోతున్నట్టు అంబానీ చెప్పారు. పంట వ్యర్థాలను గ్యాస్ గా మార్చి పరిశ్రమలకు ఇస్తామని తెలిపారు. ఈ గ్యాస్ ను వంటగదులు, వాహనాలకు కూడా వాడొచ్చని చెప్పారు. వచ్చే నాలుగేళ్లలో ఉత్తరప్రదేశ్ లో రూ. 75 వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్టు తెలిపారు. ఇప్పటికే యూపీలో పెట్టిన రూ. 50 వేల కోట్లకు ఇది అదనమని అన్నారు. లక్నోలో జరుగుతున్న ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.