Adani group: షేర్లను తనఖా పెట్టిన అదానీ గ్రూప్ సంస్థలు
- అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్, అదానీ ట్రాన్స్ మిషన్ షేర్ల తనఖా
- గ్రూప్ ఫ్లాగ్ షిప్ కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజెస్ రుణాలకు హామీగా
- షేర్ల ధరలు తగ్గడంతో చోటు చేసుకున్న పరిణామం
అదానీ గ్రూప్ కంపెనీలకు సంబంధించి ప్రమోటర్లు తమ వాటాల్లో కొంత మొత్తాన్ని తనఖాగా పెట్టారు. ఈ విషయాన్ని ఎస్ బీఐ క్యాప్ ట్రస్టీ బీఎస్ఈకి తెలియజేసింది. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్, అదానీ ట్రాన్స్ మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లను అదానీ ఎంటర్ ప్రైజెస్ కు ఇచ్చిన రుణాలకు హామీగా ఎస్ బీఐ ట్రస్టీ కంపెనీ వద్ద ప్రమోటర్లు తనఖాగా ఉంచారు. ఎస్ బీఐ క్యాపిటల్ అనేది ఎస్ బీఐ అనుబంధ సంస్థ.
అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ సంస్థ అదానీ గ్రూపు కంపెనీల్లో అవకతవకలు అంటూ నివేదికను విడుదల చేయడం, దీన్ని అదానీ గ్రూప్ సంస్థలు తీవ్రంగా ఖండించడం తెలిసిందే. మార్కెట్లో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు గణనీయంగా పడిపోవడంతో ప్రమోటర్లు తమ వాటాలను రుణాలకు తనఖాగా ఉంచినట్టు తెలుస్తోంది. వరుస పరిణామాలతో అదానీ గ్రూపు ప్రస్తుతం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
అయితే, తాజా షేర్ల తనఖా అదానీ గ్రూప్ నకు సంబంధించి ఆశ్చర్యకర పరిణామమే. ఎందుకంటే ఇటీవలే అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్ కు సంబంధించి తనఖాలో ఉన్న షేర్లను ముందుగా రుణాలు చెల్లించి విడిపించుకున్న ప్రమోటర్లు.. తిరిగి గ్రూపులోని నాలుగు సంస్థల షేర్లను తనఖా పెట్టడం ఆలోచింపజేసేదే. షేర్ల ధరలు మరింత తగ్గడంతో రుణదాతల విశ్వాసం పొందేందుకు తనఖా ఉంచినట్టు భావించాల్సి వస్తోంది.