Ravindra Jadeja: నాగపూర్ టెస్టులో జడేజాకు జరిమానా
- చేతి వేలికి క్రీము రాసుకున్న జడేజా
- అంపైర్ల అనుమతి తీసుకోలేదని నిర్ధారణ
- ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం ఇది తప్పిదం
- జడేజా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత
- జడేజా ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్
నాగపూర్ టెస్టులో టీమిండియా ఘనవిజయంలో కీలకపాత్ర పోషించిన స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా జరిమానాకు గురయ్యాడు. అంపైర్ అనుమతి లేకుండా చేతికి క్రీము పూసుకున్నాడన్న కారణంగా జడేజా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. అంతేకాదు జడేజా ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ కూడా జతచేశారు.
జడేజా తన చర్యతో ఐసీపీ కోడ్ ఆఫ్ కాండక్ట్ లోని ఆర్టికల్ 2.20 ఉల్లంఘించినట్టు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ నిర్ధారించారు.
ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 46వ ఓవర్ జరుగుతున్న సమయంలో జడేజా తన ఎడమచేతి చూపుడు వేలుకు క్రీము రాసుకుంటూ కనిపించాడు. సహచర ఆటగాడు మహ్మద్ సిరాజ్ చేతిపై ఉన్న క్రీమును జడేజా తన వేలికి రాసుకుంటుండడం వీడియోలో కనిపించింది.
క్రీమును వినియోగించేందుకు మైదానంలో ఉన్న అంపైర్లు నితిన్ మీనన్, రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ ల అనుమతి తీసుకోకపోవడం ఐసీసీ నిబంధనల ప్రకారం తప్పిదం. జడేజా తన తప్పును అంగీకరించడంతో తదుపరి విచారణ లేకుండా జరిమానాతో సరిపెట్టారు.
ప్రాథమిక విచారణకు జడేజాతో పాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా హాజరయ్యాడు. తాను ఉపయోగించినది నొప్పిని తగ్గించే పెయిన్ రిలీఫ్ క్రీము అని జడేజా వెల్లడించగా, రోహిత్ శర్మ అందుకు ఏకీభవించాడు.