Jean Eric Vergne: హైదరాబాద్ ఫార్ములా-ఈ రేస్ విజేత జీన్ ఎరిక్ వెర్నే
- ముగిసిన హైదరాబాద్ గ్రాండ్ ప్రీ
- రెండు, మూడు స్థానాల్లో నిక్ క్యాసిడీ, సెబాస్టియన్ బ్యూమీ
- ఫార్ములా-ఈ రేసు వీక్షించేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు
- సెలబ్రిటీల రాకతో రేస్ ట్రాక్ వద్ద కోలాహలం
హైదరాబాదులో ఈ సాయంత్రం నిర్వహించిన ఫార్ములా-ఈ గ్రాండ్ ప్రీ రేసు ముగిసింది. ఈ మెయిన్ రేసులో జీన్ ఎరిక్ వెర్నే విజేతగా నిలిచాడు. న్యూజిలాండ్ కు చెందిన నిక్ క్యాసిడీ (ఎన్విజన్ రేసింగ్ టీమ్) రెండో స్థానంలో, స్విట్జర్లాండ్ రేసర్ సెబాస్టియన్ బ్యూమీ (ఎన్విజన్ రేసింగ్ టీమ్) మూడో స్థానంలో నిలిచారు.
ఫ్రాన్స్ కు చెందిన జీన్ ఎరిక్ వెర్నే గతంలో రెండు సార్లు ఫార్ములా-ఈ వరల్డ్ చాంపియన్ గా నిలిచాడు. హైదరాబాద్ గ్రాండ్ ప్రీ రేసులో వెర్నే అమెరికా టీమ్ డీఎస్ పెన్స్ కే తరఫున బరిలో దిగాడు. ఫార్ములా-ఈ రేసులు 2014లో ప్రారంభం కాగా, వెర్నే అప్పటినుంచి ఈ రేసింగ్ లీగ్ లోని అగ్రగామి రేసర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు.
హైదరాబాదులో నేడు నిర్వహించిన రేసులో భారత్ కు చెందిన మహీంద్రా, జాగ్వార్ టీసీఎస్ రేసింగ్ టీమ్ లు కూడా పాల్గొన్నాయి. మహీంద్రా రేసింగ్ టీమ్ కు చెందిన ఒలివర్ రోలాండ్ 6వ స్థానంలో నిలవగా, అదే జట్టుకు చెందిన లూకాస్ డి గ్రాస్సి 14వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.
అదే సమయంలో, జాగ్వార్ టీసీఎస్ రేసింగ్ టీమ్ కు అదృష్టం కలిసిరాలేదు. టీసీఎస్ రేసింగ్ టీమ్ కు చెందిన శామ్ బర్డ్ తన కారుతో మిచ్ ఇవాన్స్ కారును ఢీకొట్టాడు. దాంతో ఇద్దరి కార్లను రేసు నుంచి తప్పించారు. కాగా, తదుపరి ఫార్ములా-ఈ రేసు మరో రెండు వారాల్లో దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లో జరగనుంది.