Telangana: తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు.. ఎప్పటి నుంచి అంటే !
- ఏప్రిల్ 3 నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు
- అదే నెల 25 నుంచి జూన్ 11 వరకు సెలవులు
- మార్చి రెండో వారం నుంచి ఒంటిపూట బడి.. విద్యాశాఖ తాజా ఉత్తర్వులు
తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 25 నుంచి సెలవులు ప్రకటించింది. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్ మెంట్ (ఎస్ఏ)-2 పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది. ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 10 నుంచి ఎస్ఏ-2 పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది.
అయితే, పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 13 వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు ఎస్ఏ-2 పరీక్షలను ఏప్రిల్ 12 నుంచి ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
మార్చి రెండో వారం నుంచి రాష్ట్రంలో స్కూళ్లను ఒంటిపూట నడపాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థుల పరీక్షలు ఏప్రిల్ 12 నుంచి 17 వరకు, 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థుల పరీక్షలు ఏప్రిల్ 20 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొంది.
ఏప్రిల్ 21 ఫలితాల వెల్లడి, ఏప్రిల్ 24న అన్ని స్కూళ్లలో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి 25 నుంచి సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపింది. పాఠశాలలు అన్నీ తిరిగి జూన్ 12న ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు.. అంటే 48 రోజుల పాటు విద్యార్థులకు వేసవి సెలవులు. ఈమేరకు విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.