Banks: లాభాల బాటలో ప్రభుత్వ రంగ బ్యాంకులు
- మూడో త్రైమాసికం ఫలితాలు వెల్లడి
- ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.29,175 కోట్ల లాభం
- 65 శాతం వృద్ధి నమోదు
- అత్యధికంగా 139 శాతం వృద్ధి కనబర్చిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాలు నమోదు చేశాయి. డిసెంబరు 2022తో మూడో త్రైమాసికం ముగియగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.29,175 కోట్ల లాభంతో 65 శాతం వృద్ధి కనబర్చాయి. మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.17,729 కోట్ల లాభాలు నమోదు చేయగా, ఈసారి అంతకుమించి లాభాలు రాబట్టాయి.
అత్యధికంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లాభం 139 శాతానికి పెరిగింది. మూడో త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లాభం రూ.775 కోట్లు కాగా, రూ.653 కోట్లతో యూకో బ్యాంకు తర్వాతి స్థానంలో నిలిచింది.
మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా 100 శాతానికి పైగా వృద్ధి రేటు సాధించాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 107 శాతం వృద్ధి నమోదు చేయగా, ఇండియన్ బ్యాంక్ 102 శాతం వృద్ధిరేటు కనబర్చింది.