Eatala Rajendar: ఇవాళ సీఎం కేసీఆర్ నా పేరు ప్రస్తావించారని పొంగిపోను: ఈటల

Eatala reacts to CM KCR mentioning his name in assembly

  • ముగిసిన తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
  • చివరి రోజున ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ 
  • సభలో పలుమార్లు ఈటల గురించి మాట్లాడిన కేసీఆర్
  • తనపై చేసిన దాడిని మర్చిపోనన్న ఈటల
  • టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు సైనికుడిలా పనిచేశానని వెల్లడి 

తెలంగాణ బడ్జెట్ సమావేశాల చివరిరోజు సందర్భంగా అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ పలుమార్లు ఈటల రాజేందర్ పేరు పలికారు. 

ఆనాడు తమకు సన్న బియ్యం సలహా ఇచ్చింది ఈటలేనని కేసీఆర్ వెల్లడించారు. కమ్యూనిటీ హాళ్లకు సంబంధించిన నామకరణం కూడా మా ఈటల ఆలోచనే అని తెలిపారు. డైట్ చార్జీలు పెంచాలని ఈటల కోరారు... పెంచుతున్నాం అని కేసీఆర్ స్పష్టం చేశారు. 

అంతేకాదు, ఈటలకు ఫోన్ చేసి సూచనలు, సలహాలు తీసుకోవాలని తెలిపారు. మరీ ముఖ్యంగా... ఈటల మాట్లాడిన మాటల్లో ముఖ్యాంశాలను నోట్ చేసుకోవాలని మంత్రి హరీశ్ రావుకు సూచించారు. 

దీనిపై ఈటల స్పందించారు. ఇవాళ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ నా పేరు ప్రస్తావించారని పొంగిపోను.... నా మీద జరిగిన దాడిని మర్చిపోను అని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు సైనికుడిలా పనిచేశానని, ఇప్పుడు బీజేపీలో కూడా అలాగే పనిచేస్తానని వెల్లడించారు. 

"నాకు నేనుగా పార్టీ నుంచి వెళ్లిపోలేదు. వాళ్లే నన్ను పార్టీ నుంచి గెంటివేశారు. నన్ను గెంటివేసినవాళ్లు పిలిచినా వెళ్లను. అసెంబ్లీలో నా సొంత అజెండా ఏమీ ఉండదు. ఈ సభలో వాళ్లు చెప్పిందంతా మేం నమ్ముతామని బీఆర్ఎస్ అనుకుంటోంది. మమ్మల్ని తిట్టడానికే సభా సమావేశాలు ఏర్పాటు చేశారు. సంఖ్యా బలం ఉండడంతో గంటల కొద్దీ మాట్లాడారు. జనాలను మభ్యపెట్టి మాయ చేయాలని చూశారు" అంటూ ఈటల విమర్శనాస్త్రాలు సంధించారు.

  • Loading...

More Telugu News