GVL Narasimha Rao: కాపులకు జరిగిన అన్యాయం ఈ దేశంలో మరెవరికీ జరగలేదు: జీవీఎల్ నరసింహారావు
- కాపులకు వైసీపీ, టీడీపీ రెండూ చేసిందేమీ లేదన్న జీవీఎల్
- భూదోపిడి, కుంభకోణాలకు అవకాశం ఉన్న చోటే ప్రభుత్వం పనులు చేస్తోందని మండిపాటు
- పారిశ్రామిక కారిడార్లను ప్రారంభించలేదని విమర్శ
కాపులకు రిజర్వేషన్ల అంశంలో గత టీడీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కాపులను టీడీపీ, వైసీపీ రెండూ మోసం చేశాయని అన్నారు. కాపులకు జరిగిన అన్యాయం ఈ దేశంలో మరెవరికీ జరగలేదని చెప్పారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. భూదోపిడీ, కుంభకోణాలకు ఎక్కడ అవకాశం ఉందో... అక్కడే వైసీపీ ప్రభుత్వం పనులు చేస్తోందని దుయ్యబట్టారు.
పారిశ్రామిక కారిడార్లకు భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వాన్ని ప్రదర్శిస్తోందని అన్నారు. మార్చిలో విశాఖలో ఇన్వెస్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి జగన్ ఏం చెపుతారని ప్రశ్నించారు. పారిశ్రామిక కారిడార్లను కూడా ప్రారంభించలేకపోయామని చెపుతారా? అని ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలను, పెట్టుబడిదారులను వెళ్లగొట్టడంలో తాము సిద్ధహస్తులమని చెపుతారా? అని ఎద్దేవా చేశారు.