Pune: పూణేలోని గూగుల్ కార్యాలయానికి బాంబు బెదిరింపు కాల్ చేసిన హైదరాబాదీ అరెస్ట్
- బాంబు పెట్టినట్టు నిన్న రాత్రి ఫోన్ కాల్
- బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించిన పూణే పోలీసులు
- తాగిన మైకంలో ఫోన్ చేశాడని తెలిపిన డీసీపీ దేశ్ ముఖ్
పూణేలో ఉన్న గూగుల్ కార్యాలయంలో బాంబు పెట్టినట్టు నిన్న రాత్రి వచ్చిన ఫోన్ కాల్ అందరికీ ముచ్చెమటలు పట్టించింది. అయితే అది నకిలీ కాల్ అని పోలీసులు నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ ఫోన్ కాల్ హైదరాబాద్ నుంచి వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కాల్ చేసిన వ్యక్తిని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా పూణే జోన్ 5 డిప్యూటీ పోలీస్ కమిషన్ విక్రాంత్ దేశ్ ముఖ్ మాట్లాడుతూ, పూణేలోని మంధ్వా ప్రాతంలోని ఒక బహుళ అంతస్తుల కమర్షియల్ బిల్డింగ్ 11వ ఫ్లోర్ లో గూగుల్ కార్యాలయం ఉందని... ఆఫీస్ ప్రాంగణంలో బాంబ్ పెట్టినట్టు నిన్న రాత్రి ఫోన్ వచ్చిందని చెప్పారు. వెంటనే పోలీస్ శాఖ అలర్ట్ అయిందని... బాంబ్ స్క్వాడ్ తో గూగుల్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిందని... కానీ, ఎలాంటి బాంబు దొరకలేదని తెలిపారు. హైదరాబాద్ నుంచి ఫేక్ బెదిరింపు కాల్ వచ్చినట్టు గుర్తించామని చెప్పారు. తాగిన మైకంలో అతడు ఈ కాల్ చేశాడని తెలిపారు. అతన్ని హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం జరిగిందని... ఘనటకు సంబంధించి విచారణ జరుగుతోందని చెప్పారు.