Kishan Reddy: చర్చకు నేను సిద్ధం.. ఎక్కడ చర్చిద్దాం?: సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్

Union Minister Kishan Reddy furious over Chief Minister KCR speech In the Assembly

  • ప్రెస్ క్లబ్ లోనైనా.. ప్రగతి భవన్ లోనైనా సిద్ధమేనని వెల్లడి
  • కల్వకుంట్ల కుటుంబ భాష కాకుండా గౌరవప్రదమైన భాషలో చర్చిద్దామని పిలుపు
  • దేశ ఆర్థిక పరిస్థితిపై కేసీఆర్ ఆరోపణలు అవగాహనా రాహిత్యమని విమర్శ 

దేశ ఆర్థిక పరిస్థితిపైన సీఎం కేసీఆర్ తో చర్చకు సిద్ధమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ప్రెస్ క్లబ్ లో చర్చకు వస్తారా.. అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం దగ్గర చర్చకు వస్తారా లేక మీ ప్రగతి భవన్ కు లేదా, ఫామ్ హౌజ్ కు చర్చకు రమ్మంటారా? అని ఆయన ప్రశ్నించారు. రాజీనామా లేఖను జేబులో పెట్టుకుని వస్తారా, ఎలా వస్తారో చెప్పాలని కిషన్ రెడ్డి కోరారు. చర్చకు తన తరఫున ఒక్కటే షరతని.. కల్వకుంట్ల కుటుంబ భాషలో కాకుండా గౌరవప్రదమైన తెలంగాణ భాషలో చర్చించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ఈమేరకు సోమవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

అవగాహనా లేమికి నిదర్శనం..
దేశ ఆర్థిక పరిస్థితిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆరోపణలు ఆయన అవగాహనా లేమికి సూచన అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక పరిస్థితిపైన కాకుండా రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చ జరిగితే బాగుండేదని అన్నారు. డబుల్ బెడ్రూంలు, ప్రభుత్వ పాఠశాలలు, కేసీఆర్ కిట్ లాగా కేసీఆర్ బెల్ట్ షాపులపైన ఎందుకు చర్చించలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ, వాటిపై చర్చ జరగకుండా సభను పక్కదోవ పట్టించేందుకే కేంద్రంపై కేసీఆర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేసేందుకే అసెంబ్లీ సమావేశాలు పెట్టినట్లుందని మంత్రి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. 

పిట్టకథ ఆయనకైతేనే సరిగ్గా సరిపోతుంది
శాసన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగంలో భాగంగా చెప్పిన తిరుమల రాయని పిట్టకథ ఆయనకే వర్తిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఆయన కథను ఆయనే సభలో చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ సీఎం కేసీఆర్ ను ఇంద్రుడు, చంద్రుడు, దేవుడు, తెలంగాణ జాతిపిత అంటూ భజన చేయడానికే సమయం వెచ్చించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించబోరని కేసీఆర్ కు అర్థమైందని మంత్రి చెప్పారు. అందుకే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బీఆర్ఎస్ రాజకీయ సమావేశాలుగా మార్చేశారని విమర్శించారు. 

సీఎం రాజీనామా ముచ్చటపై..
కల్వకుంట కుటుంబంలోని మంత్రులు నోరు తెరిస్తే వచ్చేవన్నీ అబద్ధాలేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతూ రాజీనామా చేయడానికి సిద్ధమంటూ కేసీఆర్ చెప్పిన మాటలపై కిషన్ రెడ్డి స్పందించారు. గత కొన్నేళ్లలో కేసీఆర్, ఆయన కుటుంబంలోని మంత్రులు చాలాసార్లు రాజీనామాలు చేశారని ఎద్దేవా చేశారు. మరో ఏడెనిమిది నెలల్లో తప్పకుండా రాజీనామా లెటర్ తో అవసరం పడుతుందని చెప్పారు. అప్పుడు తీరిగ్గా లెటర్ రాసుకోవచ్చు, ఇప్పుడే లేఖ రాసి జేబులో పెట్టుకుని తిరగడం ఎందుకని కేంద్ర మంత్రి ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News