Jagapathi Babu: నేను ఇంతే .. ఇక మారడం కష్టం: జగపతిబాబు
- వేషాలు రావాలంటే అడగాలన్న జగపతిబాబు
- అడగడం తనకి అలవాటు లేదని వెల్లడి
- వారసత్వం ఎంట్రీ వరకే ఉపయోగపడుతుందని వ్యాఖ్య
- లైఫ్ పై ఒక క్లారిటీ వచ్చిందని వివరణ
ఒకప్పుడు హీరోగా ఒక వెలుగు వెలిగిన జగపతిబాబు, ఆ తరువాత విలన్ గానూ అంతే పాప్యులర్ అయ్యారు. అయితే తాను హీరోగా చేసినప్పటికంటే, విలన్ గా అందుకున్న పారితోషికమే ఎక్కువగా ఉండటం విశేషం. అలాంటి జగపతిబాబు తాజా ఇంటర్వ్యూలో తన గురించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.
"అడక్కుండా అమ్మయినా పెట్టదు .. ఇక్కడ అడగాలి .. సందర్భాన్ని క్రియేట్ చేసుకుని మరీ అడగాలి. అలా చేయడం నాకు చేతకాదు. నన్ను చూడండి .. నేను ఉన్నాను అంటూ ముందుకు రావడం నాకు రాదు. లోపం నాలోనే ఉన్నప్పటికీ ఇప్పుడిక దానిని నేను కరెక్ట్ చేసుకోలేను .. నేను ఇంతే. ఇండస్ట్రీలో ఈ మధ్య నెపోటిజం .. నెపోకిడ్స్ అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయినా తండ్రుల బ్యాక్ గ్రౌండ్ ఎంట్రీ వరకే ఉపయోగపడుతుంది. ఆ తరువాత ఎవరి కష్టం వారు పడాల్సిందే" అన్నారు.
"ఇక్కడున్న ఆర్టిస్టులను పక్కన పెట్టేసి పరభాషా నటులను తీసుకుని వస్తున్నారనే విషయంలో నేను ఎవరినీ తప్పుపట్టను. ఎందుకంటే ఆ పాత్రకి ఎవరు సెట్ అవుతారనిపిస్తే వారినే తీసుకుంటారు. 'బాహుబలి'లో శివగామి పాత్రను రమ్యకృష్ణనే చేయాలి .. ఆ పాత్రకి మరొకరు సెట్ కారు. నేను సంపాదించింది చాలా కారణాలవలన పోయింది. అందుకు నేను ఎవరినీ బ్లేమ్ చేయడం లేదు. ఆ తరువాత నుంచి మాత్రం రియలైజ్ అయ్యాను .. ఇప్పుడు జీవితంపై నాకు ఒక క్లారిటీ ఉంది" అని ఆయన చెప్పుకొచ్చారు.