KCR: సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన వాయిదా
- వాస్తవానికి రేపు కొండగట్టులో కేసీఆర్ పర్యటన
- మంగళవారం రోజున కొండగట్టులో భక్తుల రద్దీ
- భక్తులకు అసౌకర్యం కలగకూడదని సీఎం పర్యటన వాయిదా
- కొండగట్టులో ఎల్లుండి పర్యటించాలని తాజా నిర్ణయం
తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు (ఫిబ్రవరి 14) కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలనుకున్న సంగతి తెలిసిందే. అయితే కొండగట్టులో ఆయన పర్యటన వాయిదా పడింది. కేసీఆర్ తన పర్యటనను ఎల్లుండికి మార్చుకున్నారు. రేపు మంగళవారం కొండగట్టులో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆలయ పునర్ నిర్మాణం కోసం క్షేత్రస్థాయిలో ఆలయాన్ని పరిశీలించనున్నారు. అయితే, భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే మంగళవారం రోజున ఆలయ పర్యటన ఇబ్బందికరంగా ఉంటుందని సీఎంవో భావించింది. సీఎం రాకతో భక్తులకు అసౌకర్యం కలగకూడదనే ఈ పర్యటన వాయిదా నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ సర్కారు ఇటీవలి బడ్జెట్ లో కొండగట్టు క్షేత్రం అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయించడం తెలిసిందే. యాదాద్రి తరహాలోనే ఈ పుణ్యక్షేత్రాన్ని కూడా తీర్చిదిద్దనున్నారు.