Pawan Kalyan: తాడేపల్లిలో అంధ యువతి హత్య కలచివేసింది: పవన్ కల్యాణ్
- తాడేపల్లిలో రాణి అనే అంధురాలి హత్య
- నరికి చంపిన రౌడీషీటర్ రాజు
- మృగాడిని కఠినంగా శిక్షించాలన్న పవన్
- పాలకుడు కోటలో ఉన్నా, పేటలో ఉన్నా ఒకటేనని విమర్శలు
గుంటూరు జిల్లా తాడేపల్లిలో రాణి అనే కంటిచూపు లేని అమ్మాయిని రాజు అనే రౌడీషీటర్ దారుణంగా హత్య చేయడం తెలిసిందే. ఈ ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.
తాడేపల్లిలో ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో అంధ యువతి హత్యకు గురైన ఘటన కలిచివేసిందని తెలిపారు. కంటిచూపునకు నోచుకోని యువతిని వేధింపులకు గురిచేసి కిరాతకంగా నరికి చంపిన మృగాడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
సదరు వ్యక్తి గంజాయి మత్తులో నేరానికి ఒడిగట్టాడని, గతంలోనూ పోలీసులపైనా, మహిళలపైనా దాడులకు తెగబడ్డాడని పోలీసులు చెబుతున్నారని పవన్ వివరించారు. ఈ ఘటనను శాంతిభద్రతల వైఫల్యంగా చూడాలని పేర్కొన్నారు.
సీఎం నివాసం పరిసరాల్లో పటిష్ఠమైన పోలీసు పహరా, నిఘా వ్యవస్థలు ఉంటాయని, అయినప్పటికీ తాడేపల్లి ప్రాంతం అసాంఘిక శక్తులకు, గంజాయికి అడ్డాగా మారిందని తెలిపారు. ఏడాదిన్నర కిందట ఇదే ప్రాంతంలో ఓ యువతిపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుల్లో ఒక్కరిని కూడా పట్టుకోలేకపోయారంటే వైఫల్యం ఎవరిదని పవన్ నిలదీశారు.
తన నివాసం పరిసరాల్లో పరిస్థితులనే సమీక్షించకుండా మౌనంగా ఉండే పాలకుడు కోటలో ఉన్నా ఒకటే, పేటలో ఉన్నా ఒకటేనని విమర్శించారు. పోలీసు శాఖకు అవార్డులు వచ్చాయని, దిశా చట్టం చేశామని చెప్పుకోవడం తప్ప రాష్ట్రంలో ఆడబిడ్డలకు మాత్రం రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు ఉన్నతాధికారులే పటిష్ఠ చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలపై అన్ని వర్గాలు ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు.
అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే... తల్లి పెంపకంలోనే లోపం ఉంది అని, ఏదో దొంగతానికి వచ్చి రేప్ చేశారు అని వ్యాఖ్యానించే మంత్రులు ఉన్న ప్రభుత్వం ఇది అని విమర్శించారు.
ఆడపడుచులపై అఘాయిత్యాలు సాగుతున్నా మహిళా కమిషన్ ఏంచేస్తోందని ప్రశ్నించారు. పదవులు ఇచ్చిన వారిని మెప్పించేందుకు రాజకీయపరమైన ప్రకటనలు, నోటీసులు ఇచ్చినంత మాత్రాన మహిళలకు రక్షణ, భరోసా దక్కవని గుర్తించాలని హితవు పలికారు.