Chandrababu: అప్పుడు చంద్రబాబు అలా అనలేదా?: మంత్రి వేణుగోపాలకృష్ణ
- రాజధాని విషయంలో శివరామకృష్ణన్ కమిటీని చంద్రబాబు పట్టించుకోలేదన్న మంత్రి
- రాజధానికి, పెట్టుబడులకు సంబంధం ఏమిటని ప్రశ్న
- ఎస్సీలకు భూములు ఇస్తే సామాజిక అసమతౌల్యత వస్తుందని బాబు అన్నారని ఆగ్రహం
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శివరామకృష్ణన్ కమిటీని పట్టించుకోకుండా వేరేగా ఓ కమిటీ వేసుకుని రాజధానిగా అమరావతిని ప్రకటించారని విమర్శించారు. అయినప్పటికీ అప్పట్లో తాము అంగీకరించామన్నారు. అయితే, తాము అధికారంలోకి వచ్చాక అమరావతిలో భూసేకరణ ఎలా చేశారన్న విషయం తెలిసిందన్నారు. ఎస్సీలకు భూ పట్టాలు ఇవ్వాలని కోరితే సామాజిక అసమతౌల్యత వస్తుందని చంద్రబాబు అనలేదా? అని ప్రశ్నించారు. ఓ పాలకుడు అలా ఎలా అంటారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజధానిని చూసి రాష్ట్రంలో ఎవరూ పెట్టుబడులు పెట్టరన్న మంత్రి.. పరిపాలనను చూసే పెట్టుబడులు వస్తాయన్నారు. అయినా, రాజధానికి, పెట్టుబడులకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు గతంలో దావోస్ వెళ్లి ఎన్ని పెట్టుబడులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. మూడు ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే సీఎం జగన్ మూడు రాజధానులను ప్రకటించారని, పరిపాలన రాజధానిగా విశాఖను ఎంచుకున్నారని మంత్రి వివరించారు. సచివాలయంలో నిన్న విలేకరులతో మాట్లాడుతూ మంత్రి వేణుగోపాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు.