turkey: టర్కీ భూకంప విలయం.. మానవ తప్పిదాల వల్లే భారీ విధ్వంసం
- నిర్మాణాలకు పటిష్ఠ నిబంధనలు పెట్టినా.. వాటి అమలులో నిర్లక్ష్యం
- అధికారుల చేతులు తడిపి కట్టడాలు పూర్తిచేసిన యజమానులు
- ఫీజు తీసుకుని అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించిన ప్రభుత్వం
- రూల్స్ పాటించి ఉంటే ఇన్ని బిల్డింగ్ లు కూలేపోయేవి కావంటున్న నిపుణులు
టర్కీ (తుర్కియే)లో భూకంపం సృష్టించిన విధ్వంసానికి మానవ తప్పిదాలు కూడా కారణమేనని తాజాగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల అవినీతి, ప్రభుత్వ నిర్లక్ష్యం వెరసి ఈ ప్రమాద తీవ్రతను పెంచాయి. తాము భూకంప కేంద్రంలో ఉన్న విషయం తెలిసీ, గత అనుభవాలను మరిచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల పెద్ద పెద్ద బిల్డింగులు ఇప్పుడు పేకమేడల్లా కూలిపోయాయి. నిర్మాణాల విషయంలో నిబంధనల అమలును సీరియస్ గా తీసుకోకపోవడం టర్కీ ప్రజల కొంప ముంచింది.
అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టి, ప్రభుత్వ అధికారులకు లంచాలు ముట్టజెప్పి, ప్రభుత్వం కోరిన సొమ్ము చెల్లించి చాలమంది తమ బిల్డింగ్ లను క్రమబద్ధీకరించుకున్నారు. అయితే, భూకంప ధాటికి ఆ ఇళ్లు నేలకూలాయి. కిందటి వారం సంభవించిన భూకంపంలో ఇప్పటి వరకు 37 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, దీనికి ప్రధాన కారణం నిర్మాణ రంగంలో నిబంధనలు గాలికి వదిలేయడమేనని నిపుణులు ఆరోపిస్తున్నారు.
వాస్తవానికి ప్రస్తుత అధ్యక్షుడు ఎర్దొగాన్ కు అధికారం దక్కడానికి గతంలో జరిగిన భూకంపమే కారణం. 1999లో భారీ భూకంపం టర్కీని అతలాకుతలం చేయగా.. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగి ఎర్దొగాన్ నేతృత్వంలోని ఏకే పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. అధికారంలోకి వచ్చాక నిర్మాణ రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపిన ఎర్దొగాన్.. నిర్మాణరంగంలో మార్పులు చేర్పులు చేశారు. పటిష్ఠమైన నిబంధనలు తీసుకొచ్చారు. 2007, 2018 సంవత్సరాలలో నిబంధనలను మరింత కఠినం చేశారు.
భూకంపాలను తట్టుకునేలా నిర్మాణాలలో ఉక్కు వాడకం పెంచాలని ప్రభుత్వం సూచించింది. అయితే, గతంలో కట్టిన నిర్మాణాల విషయంలో ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుంది. కొంత మొత్తం ఫీజుగా తీసుకుని పాత బిల్డింగులను క్రమబద్ధీకరించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో.. అంటే 3 బిలియన్ డాలర్లు సమకూరాయి. భూకంపాలను తట్టుకునేలా లేని బిల్డింగ్ లనూ క్రమబద్ధీకరించింది. ఇటీవలి భూకంపంలో ఈ బిల్డింగ్ లు కూలి, వాటికింద చిక్కుకుని చాలామంది చనిపోయారు.