Respiratory failure: శ్వాస కోస వైఫల్యం గురించి తెలుసా..?
- తీవ్ర శ్వాస కోస వ్యాధులు, ఆస్తమాతో రిస్క్
- పొగతాగడం, మద్యపానం, పాంక్రియాటిక్ సమస్యల నుంచి ముప్పు
- వెన్నెముక, మెదడుకి గాయం అయినా సమస్యే
శ్వాస కోస వ్యవస్థ వైఫల్యం (రెస్పిరేటరీ ఫెయిల్యూర్) అన్నది ప్రాణాంతకమైన సమస్య. దీని గురించి చాలా తక్కువగా వింటుంటాం. ఎందుకంటే చాలా తక్కువ మందిలోనే ఈ సమస్య కనిపిస్తుంటుంది. ముఖ్యంగా కరోనా సమయంలో దీన్ని చూసే ఉంటారు. కొన్ని రకాల అలవాట్లు, ఆరోగ్య సమస్యలు కూడా శ్వాస కోస వైఫల్యానికి దారితీసే ప్రమాదం ఉంటుంది. కనుక దీని గురించి ప్రాథమికంగా అవగాహన కలిగి ఉండడం మంచిదే.
ఊపిరితిత్తులు తగినంత ఆక్సిజన్ ను తీసుకోలేకపోవడం రెస్పిరేటరీ ఫెయిల్యూర్ గా చెబుతారు. అంటే అప్పుడు కృత్రిమ పరికరాల సాయంతో ఆక్సిజన్ ను అందించాల్సి ఉంటుంది. కనుక ఈ పరిస్థితుల్లో కాలహరణం చేయకుండా రోగిని వేగంగా ఆసుపత్రికి తరలించాలి. రక్తం నుంచి కార్బన్ డై ఆక్సైడ్ ను తీసేసి, ఆక్సిజన్ ను నింపడం అన్నది ఊపిరితిత్తులు చేసే పని. రెస్పిరేటరీ ఫెయిల్యూర్ లో ఈ ప్రక్రియ ఆగిపోతుంది. రక్తంలో కార్బన్ డై ఆక్సైడ్ పెరిగిపోయి, ఆక్సిజన్ తగ్గిపోయి ప్రాణాంతకం అవుతుంది.
అక్యూట్, క్రానిక్ అని రెండు రకాలుగా శ్వాసకోశ వ్యవస్థ వైఫల్యాన్ని వర్గీకరిస్తారు. వీటినే హైపాక్సెమిక్, హైపర్ కాప్నిక్ అని పిలుస్తారు. ఒకరి రక్తంలో తగినంత ఆక్సిజన్ లేకపోవడాన్ని హైపాక్సెమిక్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ లేదా హైపోక్సిమియా అంటారు. రక్తంలో కార్బన్ డై ఆక్సైడ్ అధికం కావడాన్ని హైపర్ కాప్నియా లేదా హైపర్ కాప్నిక్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ గా చెబుతారు.
వీటికి కారణాలను చూస్తే..
గొంతులో తీవ్ర అవరోధం ఏర్పడిన సందర్భాల్లో రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఏర్పడవచ్చు. వెన్నెముక లేదా మెదడుకు గాయం అయినా, అది శ్వాస తీసుకునే ప్రక్రియపై ప్రభావం పడేలా చేయవచ్చు. న్యూమోనియా, సెప్సిస్, పాంక్రియాటైటిస్ తోనూ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఏర్పడవచ్చు. హానికారక, విషతుల్య పొగలను పీల్చిన సందర్భాల్లోనూ రెస్పిరేటరీ వ్యవస్థ విఫలమవుతుంది.
రిస్క్ అంశాలు
పొగతాగే అలవాటు, మద్యపానం, కుటుంబంలో శ్వాసకోస వ్యాధుల చరిత్ర ఉంటే అలాంటి వారికి దీనికి సంబంధించి రిస్క్ ఉంటుంది. అలాగే, బలహీన వ్యాధి నిరోధకత, తీవ్ర శ్వాసకోస సమస్యలు, లంగ్ కేన్సర్, ఆస్తమాలోనూ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఏర్పడవచ్చు. శ్వాస తక్కువగా ఉందనడానికి నిదర్శనంగా.. ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో సమస్యలు, మెట్లు ఎక్కలేకపోవడం, అలసిపోయినట్టు ఉండడం కనిపిస్తాయి.
రెస్పిరేటరీ ఫెయిల్యూర్ సమస్యను నయం చేయవచ్చు. ఆలస్యం చేస్తే ప్రాణాంతకం అవుతుంది. అది పల్మనరీ ఎంబోలిజం, పల్మనరీ ఫైబ్రోసిస్, న్యూమోనియా, న్యూమోథొరాక్స్, మూత్రపిండాల వైఫల్యం, కాలేయం వైఫల్యానికి దారితీస్తుంది. శ్వాస సులభంగా తీసుకునేందుకు వైద్యులు మందులు సూచిస్తారు. పరిస్థితి తీవ్రతలో నోరు లేదా ముక్కు ద్వారా ఆక్సిజన్ సరఫరా పైప్ ను ఊపిరితిత్తుల్లోకి పంపించి, వెంటిలేటర్ సాయంతో ఆక్సిజన్ ను అందిస్తారు.