Revanth Reddy: పొలంలో దిగి వరి నాట్లు వేసిన రేవంత్ రెడ్డి... వీడియో ఇదిగో!
- హాత్ సే హాత్ జోడో పాదయాత్ర చేపట్టిన రేవంత్
- భద్రాచలం జిల్లాలో పాదయాత్ర
- పొలాన్ని చూడగానే ప్యాంటు పైకి మడిచిన టీపీసీసీ చీఫ్
- కూలీలతో కరచాలనం
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర భద్రాచలం జిల్లాలో కొనసాగుతోంది. రేవంత్ పాదయాత్రకు నేడు 8వ రోజు. కాగా, ఆయన ఇవాళ ఓ పొలంలో దిగి వరి నాట్లు వేశారు.
పాదయాత్ర మార్గమధ్యంలో పొలాన్ని చూడగానే, ఆయన ప్యాంటు పైకి మడిచి, తలపాగా చుట్టారు. అప్పటికే నాట్లు వేస్తున్న కూలీలను పలకరించి, వారితో కరచాలనం చేశారు. ఆపై, తాను కూడా వారితో కలిసి నాట్లు వేశారు. మహిళా కూలీలు పాట పాడుతుండగా, రేవంత్ ఉత్సాహంగా నాట్లు వేశారు.
ఈ సందర్భంగా రేవంత్... డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చిందా? అని అడిగారు. అందుకు వారు రాలేదన్నా అంటూ బదులిచ్చారు. దాంతో, రేవంత్ స్పందిస్తూ, పేదలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తామని, గ్యాస్ సిలిండర్ రూ.500కే ఇస్తామని రేవంత్ వివరించారు.
ఈ సందర్భంగా ఓ మహిళా కూలీ భావోద్వేగాలకు గురై కంటతడి పెట్టుకోగా... రేవంత్ ఆమెను ఓదార్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధనసరి సీతక్క కూడా అక్కడే ఉన్నారు. ఆమె కూడా పొలంలో దిగి నాట్లు వేశారు.