Revanth Reddy: బీఆర్ఎస్ పాలనలో భద్రాచలం ఆలయం తన గుర్తింపును పూర్తిగా కోల్పోయింది: రేవంత్ రెడ్డి
- కొనసాగుతున్న రేవంత్ హాత్ సే హాత్ జోడో పాదయాత్ర
- భద్రాచలం నియోజకవర్గంలో పాదయాత్ర
- రాముడి ఆలయం అభివృద్ధికి నోచుకోవడంలేదన్న రేవంత్
- కేసీఆర్ వెయ్యికోట్లతో అభివృద్ధి చేస్తానని మాటిచ్చారని వెల్లడి
- మాటిచ్చి మోసం చేసినవాడు బాగుపడడని వ్యాఖ్యలు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర భద్రాచలం నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. భద్రాచలంలోని సుప్రసిద్ధ శ్రీరాముడి ఆలయం అభివృద్ధికి నోచుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
భద్రాచలం ఆలయాన్ని రూ.1000 కోట్లతో అభివృద్ధి చేస్తానని కేసీఆర్ వాగ్దానం చేశారని, కానీ ఆ విషయమే పట్టించుకోవడం మానేశారని వ్యాఖ్యానించారు. శ్రీరాముడికి మాటిచ్చి మోసం చేసినవాడు ఎవరూ బాగుపడరని స్పష్టం చేశారు. కనీసం శ్రీరాముడికి తలంబ్రాలు ఇచ్చేందుకు కూడా కేసీఆర్ రాలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో భద్రాచలం ఆలయం తన గుర్తింపును పూర్తిగా కోల్పోయిందని అన్నారు.
ఇక, గోదావరి ముంపు బాధితుల పట్ల కూడా కేసీఆర్ అన్యాయంగా వ్యవహరిస్తున్నారని, బాధితులకు ఇస్తామన్న రూ.10 వేలు ఇంతవరకు ఇవ్వలేదని ఆరోపించారు. సీతారామ ప్రాజెక్టు వద్ద నిర్మించ తలపెట్టిన పవర్ ప్రాజెక్టు కోసం భూములు తీసుకున్నారని, ఆ భూములకు ఇప్పటిదాకా పరిహారం చెల్లించలేదని అన్నారు.