BBC: భారత్ లోని తమ కార్యాలయాల్లో ఐటీ సోదాల పట్ల బీబీసీ స్పందన
- ఇటీవల మోదీపై డాక్యుమెంటరీ ప్రసారం చేసిన బీబీసీ
- భగ్గుమంటున్న బీజేపీ నేతలు
- ఢిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాలకు వెళ్లిన ఐటీ అధికారులు
- దాడులు కావని... సర్వేలు అని వెల్లడించిన ఐటీ శాఖ
అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీపై భారత ఐటీ శాఖ దృష్టి సారించడం తెలిసిందే. ఢిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. విపక్షాలు దీనిపై భగ్గుమన్నాయి. ప్రశ్నించేవారిని వేధింపులకు గురిచేస్తారన్న విషయం మరోసారి స్పష్టమైందని విపక్షనేతలు విమర్శనాస్త్రాలు సంధించారు. అటు, ఐటీ శాఖ వివరణ ఇస్తూ, అవి దాడులు కాదని, సర్వేలు అని వెల్లడించింది.
దీనిపై బీబీసీ యాజమాన్యం స్పందించింది. భారత ఐటీ అధికారుల 'సర్వే'లకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని పేర్కొంది. ఢిల్లీ, ముంబయిలోని తమ కార్యాలయాలకు ఐటీ అధికారులు వచ్చినట్టు లండన్ లో ఓ బీబీసీ అధికార ప్రతినిధి నిర్ధారించారు. ఈ పరిస్థితి త్వరలోనే చక్కబడుతుందని భావిస్తున్నామని తెలిపారు.
గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో ప్రధాని మోదీ కేంద్రబిందువుగా ఇటీవల బీబీసీ రెండు భాగాలతో కూడిన డాక్యుమెంటరీ ప్రసారం చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. బీజేపీ నేతలు బీబీసీపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో, ఐటీ అధికారులు బీబీసీ కార్యాలయాలకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
బీబీసీ కార్యాలయాలకు ఐటీ అధికారులు వెళ్లడాన్ని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, అంతర్జాతీయ పాత్రికేయుల సమాఖ్య తప్పుబట్టాయి. కీలక అంశాలపై నోరెత్తకుండా చేసేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించాయి.
ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాలరాసే ప్రయత్నమని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత విభాగం చీఫ్ ఆకార్ పటేల్ పేర్కొన్నారు. బీబీసీని బెదిరింపులకు గురిచేయాలన్న ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు.