Bad Breath: నోటి దుర్వాసన తొలగించుకునే సులభ మార్గాలు

Home Remedies To Cure Bad Breath Naturally causes

  • నోటి నుంచి దుర్వాసన వెలువడడానికి ఎన్నో కారణాలు
  • పళ్ల మధ్యలో ఇరుక్కుపోయే ఆహారం కుళ్లి దుర్వాసన
  • నోరు ఎండిపోయినా ఇదే పరిస్థితి

కొంత మంది గమనించుకోరు కానీ, వారితో సంభాషించే సమయంలో ఎదుటి వారు ఎంతో అసౌకర్యానికి గురవుతుంటారు. దీనికి కారణం నోటి దుర్వాసన. కొందరి నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. ఎదుట ఉన్నవారికే గానీ, మాట్లాడేవారికి తెలియదు. చెబితే నొచ్చుకుంటారేమో? అన్న సందేహంతో చెప్పరు. దీంతో నోటి దుర్వాసన వచ్చే వారితో ఎక్కువ సేపు మాట్లాడేందుకు ఇతరులు వెనుకాడతారు. కనుక ఈ ఇబ్బందిని తొలగించుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ నోటికి చేతిని అడ్డుగా పెట్టుకుని ఒక్కసారి గాలి బలంగా బయటకు వదిలి, దుర్వాసన వస్తుందేమో చెక్ చేసుకోవాలి.

కారణాలు..
  • నోటి దుర్వాసన వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి. ఇందులో ఒకటి డ్రై మౌత్. అంటే నోరు ఎండిపోవడం. కొన్ని రకాల ఔషధాలు తీసుకునేవారు, పొగతాగే అలవాటు ఉన్నవారిలో నోరు ఎండిపోయి దుర్వాసనకు కారణమవుతుంది. నోటిలో లాలాజలం ఉత్పత్తి అవుతుండాలి. లాలాజలం నోటిని శుభ్రం చేస్తుంటుంది. ఈ లాలాజలం తగ్గిన వారిలో దుర్వాసన వస్తుంటుంది. 
  • శుభ్రత లోపించడం మరో కారణం. చాలా మంది నోటి దుర్వాసన వెనుక ఉండే కారణం ఇదే. తిన్న ఆహార పదార్థాలు పళ్లల్లో చిక్కుకుని, అవి పాడయ్యి దుర్వాసన వెలువడుతుంది. 
  • గ్యాస్ట్రో ఇంటెస్టినల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్ డీ) అనేది జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్య. తిన్న ఆహారాన్ని విచ్చిన్నం చేసి జీర్ణమయ్యేందుకు జీర్ణరసాలు విడుదల అవుతుంటాయి. ఈ రసాలు తిరిగి అన్నవాహిక పైపులోకి రావడమే జీఈఆర్డీ. 
  • చిగుళ్ల సమస్యల్లోనూ నోటి దుర్వాసన వస్తుంటుంది. చిగుళ్లు నుంచి రక్తం కారుతున్నా, చిగుళ్ల వాపు కనిపించినా వైద్యులను సంప్రదించాలి.
  • మౌత్ కేన్సర్ (ముక్కు, నోటి మధ్య భాగంలో కేన్సర్) ఉన్న వారిలోనూ దుర్వాసన వస్తుంది. 
  • అలాగే, మధుమేహం, ముక్కులో ఇన్ఫెక్షన్, గొంతులో ఇన్ఫెక్షన్ కూడా దీనికి కారణమవుతాయి.

ఇంటి పరిష్కారాలు
పైన చెప్పుకున్నట్టు జీఈఆర్డీ, కేన్సర్, చిగుళ్ల సమస్యల వల్ల వస్తే వైద్యులను సంప్రదించాలి. ఇతర సమస్య వల్ల అయితే అందుకు కొన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయి. పెరుగుతో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. నోటి నుంచి దుర్వాసన వచ్చే వారు పెరుగును తినాలి. అప్పుడు పెరుగులోని మంచి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది. లవంగం నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉండడం మంచి ఫలితాన్నిస్తుంది. పంటి నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. 

అలాగే, సోంపు కూడా దుర్వాసనను పోగొడుతుంది. నీటిలో కొంత సోంపు వేసి కాచి, గోరు వెచ్చగా మారిన తర్వాత ఆ నీటితో పుక్కిలించడం కూడా ఫలితమిస్తుంది. తమలపాకులు నమలడం ద్వారా దుర్వాసన పోతుంది. తులసిలోనూ మంచి ఔషధ గుణాలున్నాయి. తులసి ఆకులను పుక్కిట పెట్టుకుని కొంచెం కొంచెం నములుతూ విడుదలయ్యే రసాన్ని గార్గిల్ చేసి మింగేయాలి. ఆహారం తీసుకున్న వెంటనే బ్రష్ చేసుకోవాలి. దీనివల్ల పళ్ల మధ్యలో ఆహారం ఇరుక్కుంటే పోతుంది. పొగాకు ఉత్పత్తులు నమిలే అలవాటు, చూయింగ్ గమ్ అలవాట్లను విడిచిపెట్టాలి.

  • Loading...

More Telugu News