bbc: బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలపై అమెరికా ఏమంటోందంటే..!
- సోదాలపై తమకు సమాచారం ఉందన్న అమెరికా
- పత్రికా స్వేచ్ఛకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని వ్యాఖ్య
- బీబీసీ ఆఫీసుల్లో సోదాలకు సంబంధించి నిజాలు తెలుసన్న విదేశాంగ శాఖ ప్రతినిధి
- ఐటీ సర్వే పూర్తయ్యాక అన్ని వివరాలు వెల్లడిస్తామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడి
భారతదేశంలోని బీబీసీ కార్యాలయాల్లో జరుగుతున్న ఐటీ సోదాలపై అమెరికా స్పందించింది. ఢిల్లీ, ముంబైలలో జరుగుతున్న సోదాలపై తమకు సమాచారం ఉందని పేర్కొంది. అయితే, తాము ఎలాంటి నిర్ణయం తీసుకునే స్థితిలో లేమని అమెరికా విదేశాంగ ప్రతినిధి నెడ్ ప్రైస్ పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛ ప్రాముఖ్యత తమకు తెలుసని, ప్రపంచవ్యాప్తంగా దానికి తమ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు.
ఈమేరకు మీడియా సమావేశంలో నెడ్ మాట్లాడుతూ.. బీబీసీ ఆఫీసులలో భారత ఐటీ అధికారులు జరుపుతున్న సోదాల విషయం తమకు తెలుసని అన్నారు. ఈ సోదాలకు సంబంధించిన నిజాలు కూడా తనకు తెలుసని చెప్పారు. అయితే, ఈ విషయంపై మాట్లాడే స్థితిలో తాను లేనని వివరించారు. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇండియన్ అధికారులనే సంప్రదించాలని అమెరికా మీడియాకు నెడ్ సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా భావప్రకటన స్వేచ్ఛ, మత స్వేచ్ఛలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠం చేయడానికి భావప్రకటన స్వేచ్ఛ తోడ్పడుతుందని వ్యాఖ్యానించారు. అమెరికాతో పాటు ఇండియాలో ప్రజాస్వామ్యాన్ని బలంగా తీర్చిదిద్దింది భావప్రకటన స్వేచ్ఛేనని నెడ్ పేర్కొన్నారు.
మరోవైపు, బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయో ఆదాయపన్ను శాఖ ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తుందని, సర్వే పూర్తయ్యాక వివరాలను బయటకు వెల్లడిస్తుందని మంత్రి చెప్పారు. బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సర్వే పూర్తయిన తర్వాత పూర్తి వివరాలను మీడియాకు వెల్లడిస్తామని మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.