TDP: ఎన్నికల సంఘాన్ని కలిసిన టీడీపీ నేతలు... వైసీపీపై ఫిర్యాదు
- ఏపీలో మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలు
- వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందన్న టీడీపీ
- ప్రలోభాలకు గురిచేస్తోందని ఆరోపణ
- ఓట్లను తారుమారు చేస్తున్నారని ఫిర్యాదు
వచ్చే నెలలో ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, టీడీపీ నేతలు నేడు ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అవకతవకలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. ఓటర్లను అధికార వైసీపీ ప్రలోభాలకు గురిచేస్తోందని, ఓట్లను తారుమారు చేస్తోందని టీడీపీ నేతలు ఎస్ఈసీకి వివరించారు.
ఎన్నికల సంఘంతో భేటీ అనంతరం టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనంద్ బాబు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలపై ఫిర్యాదు చేశామని చెప్పారు. ప్రలోభాలకు గురిచేసేందుకు ఎమ్మెల్సీ కల్పనా రెడ్డి భర్త ప్రతాప్ రెడ్డిని కడప ఆర్జేడీగా నియమించారని ఆరోపించారు.
గతంలో కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా తన భార్య కల్పనా రెడ్డిని ప్రలోభాలు, బెదిరింపులతో గెలిపించుకున్న చరిత్ర ప్రతాప్ రెడ్డిదని స్పష్టం చేశారు. ఇదే విధానాన్ని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రతాపరెడ్డిని వాడుకుంటోందని నక్కా ఆనంద్ బాబు విమర్శించారు.