Team India: ఐసీసీ ర్యాంకుల్లో మనవాళ్లదే హవా
- ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్
- సొంతగడ్డపై సిరీస్ లు కుమ్మేస్తున్న వైనం
- రెండు ఫార్మాట్లలో టీమిండియానే నెం.1... టెస్టుల్లో నెం.2
ఇటీవల కాలంలో విశేషంగా రాణిస్తున్న టీమిండియా ఐసీసీ ర్యాంకుల్లోనూ ఆధిపత్యం చలాయిస్తోంది. సొంతగడ్డపై వరుస సిరీస్ ల విజయాలతో ఊపుమీదున్న భారత్ అంతర్జాతీయ ర్యాంకింగ్స్ లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ చూస్తే టీమిండియా హవా స్పష్టంగా కనిపిస్తుంది.
టీ20ల్లో 267 రేటింగ్ పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. వన్డేల్లో 114 రేటింగ్ పాయింట్లతో టాప్ లో కొనసాగుతుండగా... టెస్టుల్లో ఆసీస్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతోంది. రెండో టెస్టులోనూ టీమిండియా నెగ్గితే.... అప్పుడు ఐదు రోజుల ఫార్మాట్ లోనూ అగ్రస్థానం మనదే అవుతుంది.
జట్టు ర్యాంకింగ్స్ అటుంచితే... వ్యక్తిగత ర్యాంకింగ్స్ లోనూ భారత ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. సూపర్ ఫామ్ లో ఉన్న 'మిస్టర్ 360' సూర్యకుమార్ యాదవ్ టీ20 బ్యాటింగ్ ర్యాంకుల్లో టాప్ పొజిషన్ లో ఉన్నాడు.
ఇక వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్ లో యువ పేసర్ మహ్మద్ సిరాజ్ నెం.1 స్థానంలో ఉన్నాడు. గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న సిరాజ్... హేజిల్ వుడ్, ట్రెంట్ బౌల్ట్, మిచెల్ స్టార్క్ వంటి దిగ్గజ బౌలర్లను అధిగమించి, ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరడం విశేషం.
అటు, టెస్టు ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్ లోనూ భారత్ ముద్ర కనిపించింది. గాయం నుంచి కోలుకుని జట్టులోకి పునరాగమనం చేసిన రవీంద్ర జడేజా... వస్తూనే ఆసీస్ పై అదిరిపోయే ప్రదర్శనతో ర్యాంకింగ్స్ లో అందనంత ఎత్తులో నిలిచాడు.
టెస్టు ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా అగ్రస్థానంలో ఉండగా, అతడి ఖాతాలో 424 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రెండో స్థానంలో ఉన్న రవిచంద్రన్ అశ్విన్ ఖాతాలో 358 పాయింట్లే ఉన్నాయంటే జడేజా పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గాయంతో ఆరు నెలలు ఆటకు దూరమైనా జడేజా ర్యాంకుకు ఎలాంటి ముప్పు కలగలేదు.