Cricket: రెండో టెస్టులో రాహుల్, సూర్యకుమార్‌లను పక్కన పెట్టాలంటున్న మాజీ క్రికెటర్ వసీం జాఫర్
- ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో నిరాశపరిచిన రాహుల్, సూర్య
- శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్ లను దించాలని వసీం సూచన
- వసీం జాఫర్ అంచనా జట్టులోనూ రాహుల్, సూర్యకు నో ఛాన్స్
ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. రెండో టెస్టులోనూ గెలిచేందుకు ఉవ్విళ్లూరుతోంది. అయితే.. మొదటి టెస్టులో నిరాశపరిచిన ఓపెనర్ కేఎల్ రాహుల్, సూర్యకుమార్‌లకు రెండో టెస్టులో చోటివ్వకూడదని టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డారు. తదుపరి మ్యాచ్‌లో బ్యాటింగ్ లైనప్ ఎలా ఉండాలో చెబుతూ తన అంచనా టీంను ప్రకటించారు. రాహుల్ స్థానంలో ఓపెనర్ శుభమన్ గిల్‌కు, సూర్యకుమార్‌కు బదులు శ్రేయస్ అయ్యర్‌ను రంగంలోకి దించితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.
గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. అతడు ఢిల్లీ టెస్టు జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ధ్రువీకరించింది. ఇక తొలి టెస్టులో రాహుల్ కేవలం 20 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టగా సూర్య 8 పరుగులకే వెనుదిరిగాడు. ఇది అతడి అరంగేట్ర మ్యాచ్ కావడం గమనార్హం. దీంతో.. వీరిద్దరినీ ఢిల్లీ వేదికగా శుక్రవారం జరగనున్న మ్యాచ్‌కు దూరం పెట్టాలని ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో జాఫర్ కూడా తన అంచనా జట్టులో రాహుల్, సూర్యకు స్థానం కల్పించలేదు.