Arvind Kejriwal: హమ్మయ్య... ఈ జాబితాలో ఢిల్లీ లేదు: అరవింద్ కేజ్రీవాల్
- ప్రపంచ కాలుష్య నగరాల జాబితా వెల్లడి
- టాప్ టెన్ లో లేని ఢిల్లీ
- సంతోషం వ్యక్తం చేసిన కేజ్రీవాల్
- క్లీన్ సిటీగా నిలుస్తామని ధీమా
దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో వాయు కాలుష్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిట్ట మధ్యాహ్నం కూడా పొగమంచు తరహాలో కాలుష్య మేఘాలు నగరాన్ని కమ్మేస్తుంటాయి.
కాలుష్య తీవ్రత దెబ్బకు వాహనాలకు సరి, బేసి విధానం అమలు చేయడం, స్కూళ్లకు సెలవులు ఇవ్వడం, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అమలు చేయడం, క్రికెట్ మ్యాచ్ ల్లో ఆటగాళ్లు మాస్కులు ధరించి ఆడడం ఢిల్లీలోనే జరిగాయి. గత కొన్నేళ్లుగా ప్రపంచ టాప్-10 కాలుష్య నగరాల్లో ఢిల్లీ తప్పనిసరిగా ఉంటోంది.
అయితే, తాజా జాబితాలో ఢిల్లీ పేరు లేదు. దీనిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. చాలాకాలం తర్వాత ప్రపంచంలోని అత్యంత కాలుష్యభరిత నగరాల జాబితాలో ఢిల్లీ లేదని సంతోషంగా వెల్లడించారు. కాలుష్య నివారణకు ఢిల్లీ ప్రజలు చేపడుతున్న చర్యలు నిదానంగానే అయినా, సానుకూల ఫలితాలను ఇస్తున్నాయని వివరించారు.
"ఢిల్లీకి శుభాభినందనలు... అయితే కాలుష్యస్థాయిని అట్టడుగుకు తీసుకెళ్లాలంటే ఇంకా చాలాదూరం ప్రయాణించాల్సి ఉంది. ప్రపంచంలోని అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో ఢిల్లీ కూడా ఒకటిగా నిలవాలి" అని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
కాగా, ప్రపంచంలో అత్యంత కాలుష్య భరిత నగరాల జాబితాలో లాహోర్ (పాకిస్థాన్) మొదటి స్థానంలో ఉండగా, భారత ఆర్థిక రాజధాని ముంబయి రెండో స్థానంలో ఉంది.