Ajay Jadeja: బీ కేర్ ఫుల్... కుంబ్లే అక్కడే 10 వికెట్లు తీశాడు: ఆస్ట్రేలియాకు జడేజా హెచ్చరిక
- ఢిల్లీ వేదికగా రేపటి నుంచి రెండో టెస్టు
- ఢిల్లీ మైదానంలో భారత్ ను ఓడించడం అంత సులువు కాదన్న అజయ్ జడేజా
- టీమిండియా తొలి టెస్టులో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగాలని సూచన
బోర్డర్-గవాస్కర్ సిరీస్ లో భాగంగా రేపు ఢిల్లీ వేదికగా రెండో టెస్టు జరగనుంది. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన రోహిత్ సేన ఢిల్లీలో కూడా అదే ఊపును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు రెండో మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేయాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. అయితే ఢిల్లీ మైదానంలో భారత్ ను ఓడించడం అంత సులువు కాదని టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్ మెన్ అజయ్ జడేజా అన్నారు. స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ఢిల్లీ మైదానంలోనే 10 వికెట్లను పడగొట్టాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆస్ట్రేలియాను హెచ్చరించారు.
ఈ పిచ్ పై భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్, అశ్విన్ బౌలింగ్ లో జాగ్రత్తగా ఆడాలని చెప్పారు. ఢిల్లీ పిచ్ లో బౌన్స్ తక్కువగా ఉంటుందని... కొద్దిగా పచ్చిక ఉంటే బ్యాటింగ్ కు అనుకూలంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. తొలి టెస్టులో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగాలని టీమిండియాకు సూచించారు.