Chandrababu: ఎన్నికల్లో ఓడిపోతే జగన్ ఏ జైలుకు పోతాడో తెలియదు: చంద్రబాబు
- కాకినాడ జిల్లా పెద్దాపురంలో చంద్రబాబు రోడ్ షో
- చంద్రబాబుకు ఘనస్వాగతం
- గజమాలతో స్వాగతం పలికిన చినరాజప్ప
- కాట్రావులపల్లిలో పంట పొలాలను పరిశీలించిన చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ, సీఎం జగన్ సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టివేశాడని విమర్శించారు.
ప్రజలపై రూ.10 లక్షల కోట్ల రుణభారం మోపారని తెలిపారు. ఒక ఇంట్లో ఐదుగురు సభ్యులు ఉంటే వారిపై రూ.10 లక్షల అప్పు ఉన్నట్టు లెక్క అని చంద్రబాబు వివరించారు. ఆ అప్పు మీరే కట్టాలి... జగన్ మోహన్ రెడ్డి కట్టడు అని వ్యాఖ్యానించారు.
రేపు ఎన్నికల్లో ఓడిపోతే ఎక్కడికి పారిపోతాడో, ఏ జైలుకు పోతాడో తెలియదు అని వ్యంగ్యం ప్రదర్శించారు. కానీ అప్పు మాత్రం మన నెత్తిపైనే ఉంటుందని, బ్యాంకు వాళ్లు వచ్చేది మన ఇంటికేనని స్పష్టం చేశారు. మన ఆస్తులను, మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి అని వివరించారు.
కాగా, రోడ్ షో కోసం విచ్చేసిన చంద్రబాబుకు పెద్దాపురం నియోజకవర్గంలో ఘనస్వాగతం లభించింది. జె.తిమ్మాపురం వద్ద చంద్రబాబుకు మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప గజమాలతో స్వాగతం పలికారు. చంద్రబాబు వెంట భారీ కాన్వాయ్ తో టీడీపీ శ్రేణులు ర్యాలీగా కదిలాయి.
తన పర్యటన సందర్భంగా చంద్రబాబు కాట్రావులపల్లిలో పంట పొలాలను పరిశీలించారు. మొక్కజొన్న, మిర్చి రైతులతో మాట్లాడారు.