Madhya Pradesh: ఎంత మంచి కంపెనీయో! డ్యూటీ టైం ముగియగానే ఆఫ్ అయిపోతున్న కంప్యూటర్లు!
- మధ్యప్రదేశ్‌లోని సాఫ్ట్‌గ్రిడ్ కంప్యూటర్స్ వినూత్న ఆలోచన
- తమ ఉద్యోగులు వ్యక్తిగత జీవితాన్ని కోల్పోకుండా నిర్ణయం
- పని వేళలు ముగిసిన వెంటనే కంప్యూటర్ స్క్రీన్‌పై మెసేజ్
- ఇంకా పనిచేస్తే ఆటోమెటిక్‌గా లాక్
ఈ విషయం తెలిస్తే.. ఇంత మంచి కంపెనీలు కూడా ఉంటాయా? అనిపించకమానదు. ఆఫీసు వేళలు ముగిసినా ఇంకా కంప్యూటర్ను అంటిపెట్టుకుని ఉంటూ వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతున్నారని భావించిన ఓ ఐటీ సంస్థ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల షిప్ట్ టైం ముగిసిన వెంటనే కంప్యూటర్లు ఆటోమెటిక్‌గా ఆఫ్ అయిపోతున్నాయి. ఉద్యోగుల శ్రేయస్సు కోసం కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి.
ఆ కంపెనీ పేరు సాఫ్ట్‌గ్రిడ్ కంప్యూటర్స్. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉంది. ముఖ్యమైన పనుల డెడ్‌లైన్ కారణంగా ఉద్యోగులు చాలా వరకు ఆఫీసులోనే గడిపేస్తున్నారని, ఫలితంగా వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయి ఒత్తిడికి గురవుతున్నారని భావించిన కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల షిఫ్ట్ టైం ముగిసిన పది నిమిషాల తర్వాత కంప్యూటర్ స్క్రీన్‌పై షిఫ్ట్ టైం పూర్తయిందని, దయచేసి ఇంటికి వెళ్లాలని వార్నింగ్ మెసేజ్ వస్తుంది. ఈలోపే పని పూర్తి చేసుకుని ఇంటికి బయల్దేరాలి.
ఈ వినూత్న నిర్ణయంపై కంపెనీ హెచ్ఆర్ విభాగం స్పందిస్తూ.. ఇది ప్రమోషన్ కోసం చేస్తున్న ప్రకటన కాదని స్పష్టం చేసింది. తమ ఉద్యోగులు వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. షిఫ్ట్ టైం ముగిసిన పది నిమిషాల తర్వాత కంప్యూటర్ స్క్రీన్‌పై మెసేజ్ వస్తుందని, దీంతో సిస్టంను షట్‌డౌన్‌ను చేయాల్సిందేనని పేర్కొంది. ఒకవేళ ఇంకా సిస్టం ముందే కూర్చుంటే అది ఆటోమెటిక్‌గా లాక్ అయిపోతుందని వివరిస్తూ లింక్డ్ఇన్లో ఓ పోస్టు పెట్టింది. ఇప్పుడీ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.