Syria: సిరియాను మళ్లీ వణికించిన భూకంపం
- ఇప్పటికే సిరియా, టర్కీలను అతలాకుతలం చేసిన భూకంపాలు
- నిన్న రాత్రి సిరియాలో మరో రెండు భూకంపాలు
- నిద్రలేని రాత్రిని గడిపిన ప్రజలు
టర్కీ, సిరియాలను భారీ భూకంపం వణికించిన సంగతి తెలిసిందే. భూకంపం ధాటికి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. రెండు దేశాలకు కోలుకోనంత నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో సిరియాను మరోసారి భూకంపం వణించింది. నిన్న రాత్రి 10.47 గంటలకు 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం భూ ఉపరితలానికి 18.8 కిలోమీటర్ల లోతులో వచ్చిందని సిరియా జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. భూకంప కేంద్రం ఇడ్లిబ్ నగరానికి 61 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది.
ఆ తర్వాత రాత్రి 11.17 గంటలకు వాయవ్య తీర ప్రాంతంలోని లటాకియాలో 3.4 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఈ భూకంపం కేంద్రం లటాకియాకు 50 కిలోమీటర్ల దూరంలో భూ ఉపరితలానికి 46 కిలోమీటర్ల లోతులో సంభవించిందని అధికారులు తెలిపారు. ఈ భూకంపాలతో సిరియా ప్రజలు నిద్రలేని రాత్రులను గడిపారు. ప్రజలు ఇళ్లలో ఉండటానికి భయపడుతున్నారు. వీలైనంత ఎక్కువగా ఇళ్ల బయటే గడుపుతున్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కూడా హెచ్చరించింది.